
ఎత్తిపోతలు వద్దు.. పోలవరమే ముద్దు
పోలవరం : ‘ఎత్తిపోతల పథకం నిర్మించొద్దు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే ముద్దు’ అంటూ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతు సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్దపెట్టున నినదించారు. పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోలవరం మండలం పట్టిసీమ వద్ద సోమవారం రైతులు నిరసన దీక్ష ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల సంఘాల ప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు శిబిరం వద్దకు చేరుకుని రైతులకు మద్దతు ప్రకటించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించేంత వరకూ రైతులకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టిసీమ వద్ద రహదారిపై ప్రభుత్వ నిర్ణయూనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు ఎంవీ సూర్యనారాయణరాజు సర్కారు తీరును ఎండగట్టారు. ఈ అంశంపై కడవరకూ పోరాడేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తారని, ఆ తరువాత ఎడమ ప్రధాన కాలువకు కూడా ఎత్తిపోతల పెట్టుకోమంటారని ్ఞఅన్నారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. గడచిన 30 ఏళ్లలో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే గోదావరికి వరద వచ్చిందన్నారు. గోదావరిలో 2014 జూన్, జూలై నెలల్లో కేవలం 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉందన్నారు. ఈ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తోడేస్తే గోదావరి జిల్లాల్లోని డెల్టా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఎత్తిపోతల పథకం నిర్మించిన తరువాత వరద సమయంలోనే నీటిని తోడతారన్న గ్యారంటీ లేదన్నారు. భారతీయ ఆగ్రో ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ తిక్కిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ 80 శాతం రైతులు నిరాకరిస్తే ప్రభుత్వం భూములు సేకరించే అవకాశం లేదన్నారు. పోలవరం కుడికాలువ నిర్మాణానికి 175 కిలోమీటర్ల పొడవునా భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటికి 100 కిలోమీటర్ల మేర మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన భూములు వివాదాల్లో ఉన్నాయన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువపై రామిలేరు, తమ్మిలేరు, గుండేరు వాగులు అడ్డంగా ప్రవహిస్తున్నాయన్నారు. వీటిపై వంతెనలు నిర్మించలేదన్నారు.
ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి ఏం చేస్తారన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీలు, భారతీయ కిసాన్ సంఘ్ తూర్పు గోదావరి జిల్లా శాఖ కార్యదర్శి వోరెల్ల వెంకటానందం, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణరాజు, కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, ప్రాజెక్టు కమిటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి సుధాకర్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర డెరైక్టర్ సిరపరపు శ్రీనివాసరావు, మాజీఎమ్మెల్యే పూనెం సింగన్నదొర, పోలవరం మండల వైసీపీ కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొణతాల ప్రసాద్, సంకురు బాబూరావు, నాళం గాంధి, వివిధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.