సెట్‌టాప్ బాక్స్‌లపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టీవీ వీక్షకులు జనవరి 31 కల్లా సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం పై ఉమ్మడి హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి 31 కల్లా వీక్షకులు సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరిగా సమకూర్చుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సి.రామచంద్రరాజు, కేంద్రం తరఫున బి.నారాయణరెడ్డి, స్టార్ ఇండియా తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, తూము శ్రీనివాస్, లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమ వాదనలను వినిపించారు.