
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు పదోన్నతి లభించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఫైలుపై బుధవారం సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. బాంబే, గౌహతి, సిక్కిం, కలకత్తా హైకోర్టులకు సైతం ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–04 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment