ఎస్‌ఎఫ్‌సీ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని (ఎస్‌ఎఫ్‌సీ) ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేయక పోవడాన్ని సవా లు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు విని పిస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌సీ ఏర్పాటుకు 2015లో జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దానిని కార్యరూపంలోకి తీసుకురాలేదని వివరించారు.