కోర్టు ఆదేశాలనే పట్టించుకోరా?
ఇరు రాష్ట్రాల సీఎస్‌ల తీరుపై హైకోర్టు అసహనం
ఏపీఏటీ ఆస్తుల విభజనకు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) ఉద్యోగుల, ఆస్తుల విభజ నపై తేల్చాలని తామిచ్చిన ఆదేశాల అమలుకు ఎలాంటి చర్య లు తీసుకోక పోవడంపట్ల ఉమ్మడి హైకోర్టు గురువారం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలా అయితే వారిని కోర్టు ముందుకు పిలిపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్ కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీ సమర్పించిన నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ సర్కార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై గత నెలలో విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం... ఏపీఏటీ ఉద్యోగుల, ఆస్తుల విభజన విషయంలో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డిసెంబర్ 7లోపు సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది. నవంబర్ నెలకు వ్యయాలను ఏపీనే భరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గురు వారం ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ ఆదేశాల మేరకు సీఎస్‌లు తగిన చర్యలు తీసుకోక పోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పిన సమాధానాలపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోక పోవడం ఎంత మాత్రం సరికాదన్న ధర్మాసనం.. సీఎస్‌లను కోర్టు ముందుకు పిలిపిం చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఇరువురు ఏజీలు కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది.