నా ఇంట్లోనూ ఇంకుడు గుంత లేదు
- అందువల్ల ఈ అంశంపై పిటిషన్ విచారించలేనన్న ఏసీజే
- ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్: తన ఇంట్లో ఇంకుడుగుంత లేదని.. అందువల్ల ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యాజ్యాన్ని ప్రస్తుతం విచారించలేనని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే సంబంధిత వ్యాజ్యాన్ని విచారించడం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. తనది చిన్న ఇల్లు అని, ఇంకుడుగుంత ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియదని, ఎవరిని సంప్రదించాలో చెప్పాలని పిటిషనర్, జీహెచ్‌ఎంసీల తరఫు న్యాయవాదులను కోరారు. నివాస గృహాలన్నింటిలోనూ శాశ్వత ప్రాతిపదికన ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి పరిరక్షణ నిమిత్తం అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350 ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏసీజే తన ఇంట్లో ఇంకుడు గుంత లేని విషయాన్ని ప్రస్తావించారు. తన ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే ఈ వ్యాజ్యాన్ని విచారించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంకుడు గుంత ఏర్పాటుకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలని.. నిబంధనల ప్రకారం ఇంకుడు గుంత ఏర్పాటుకు ఎంత వసూలు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో ఆ బాధ్యత తాను తీసుకుంటానని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు తెలిపారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కోరిన విధంగా కార్యాచరణ ప్రణాళికను సమర్పించేందుకు ధర్మాసనం మూడు వారాల గడువునిస్తూ.. విచారణను వాయిదా వేసింది.