
వారి దేహాలను తీసుకురావడానికి ఏం చేస్తున్నారు?
గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల గురించి ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదంటూ హైదరాబాద్, ప్రగతినగర్‌కు చెందిన న్యాయవాది శ్రీధర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆర్నెల్లుగా శవాగారాల్లోనే మృతదేహాలు
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, ఉభయ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డారని, వారి మృతదేహాలు గత ఆరు నెలలుగా శవాగారాల్లో ఉన్నాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ఈ వ్యవహారాన్ని ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవద్దు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వివరణలతో కౌంటర్లు దాఖలు చేస్తాయి’అని కేంద్రానికి స్పష్టం చేసింది. విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.