స్వాతంత్య్ర సిద్ధిలో న్యాయవాదుల పాత్ర
వారి త్యాగఫలాలే ఈ స్వేచ్ఛా వాయువులు.. స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్య్ర సిద్ధిలో అనేక మంది న్యాయవాదుల పాత్ర ఉందని, వారి ప్రాణ త్యాగాల వల్లే ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు.
బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీ, లాలాలజ్‌పత్ రాయ్, బీఆర్ అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులంతా కూడా ప్రఖ్యాత న్యాయవాదులని, వీరిని ఈ 71వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకోవడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరంలో భూలాభాయ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, వీపీ మీనన్ తదితరుల పాత్రను వివరించారు.
దేశం లౌకిక రాజ్యమే
భారతదేశం లౌకిక రాజ్యమని నమ్మి, దానిని ఆచ రణలో చూపిన గొప్ప వ్యక్తి వల్లభాయ్ పటేల్ అన్నారు. మైనారిటీల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ప్రకటించి, ఆ మేర మైనారిటీలకు అన్ని హక్కులు కల్పించేలా చూశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం 552 రాచరిక రాష్ట్రాలను దేశంలో విలీనం చేయడంలో వల్లభాయ్ పటేల్, రాష్ట్రాల మంత్రిత్వశాఖ కార్యదర్శి వీపీ మీనన్‌ల కృషి అసాధారణ మన్నారు. పటేల్ కృషి వల్లే ఆధునిక ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటైం దన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యుద్ధ ఖైదీలుగా నిర్బంధానికి గురైన పలువురు భారత ఆర్మీ అధికారులకు స్వేచ్ఛ ప్రసాదించడంలో భూలాభాయ్ దేశాయ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆరోగ్య సహకరించకున్నా తన బలమైన వాదనలతో ఆ అధికారులు విడుదల య్యేలా చేశారన్నారు.
అనంతరం చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్‌రంగనాథన్ చేతుల మీదుగా అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, తెలంగాణ అదనపు ఏజీ, ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, బార్ కౌన్సిల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.