సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను రెండింతలు పైగా పెంచుతూ రూపొందిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే భారత ప్రధాన న్యాయమూర్తి వేతనం ప్రస్తుతమున్న లక్ష రూపాయల నుంచి రూ. 2.80 లక్షలకు, సుప్రీం న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ. 90,000 నుంచి రూ. 2.50 లక్షలకు పెరుగుతుంది.
ప్రస్తుతం నెలకు రూ. 80,000 వేతనం పొందుతున్న హైకోర్టు న్యాయమూర్తులు ఇక రూ. 2.25 లక్షల వేతనం అందుకుంటారు. ఏడో వేతన సంఘ సిఫార్సులకు అనుగుణంగా న్యాయమూర్తుల వేతన పెంపును చేపట్టారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను పెంచాలని కోరుతూ 2016లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment