వారిద్దరికీ వేతనాలు చెల్లించండి | Hasanparti college employees Pay Wages : High Court | Sakshi
Sakshi News home page

వారిద్దరికీ వేతనాలు చెల్లించండి

Published Thu, Apr 13 2017 1:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Hasanparti college employees Pay Wages : High Court

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి కళాశాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు బకాయిలుసహా వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. గత మూడు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ వీవీ పద్మజతోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

 ఏపీ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్శిటీల మధ్య ఉద్యోగుల పంపిణీ జరిగింది. ఏపీ స్థానికత ఉన్న 33 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని టీఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 58:42 శాతం ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జీతాలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే 33 మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఉద్యోగులు ఆఫీసులో రిపోర్టు చేయడం లేదని, జీతాలు ఇవ్వాలంటే తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్శిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపించారు.

అయితే కేవలం సంతకం చేసేందుకే వారిని హైదరాబాద్‌ రావాలని కోరుతున్నారని, ఇక్కడ కార్యాలయంలో వారికి ఎటువంటి పనిని కేటాయించడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. వర్సిటీ విభజన సమయంలో వారు హసన్‌పర్తిలోనే ఉన్నారని, అక్కడి కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని...వారికి జీతాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. గత 15 నెలలుగా ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులకు ఎటువంటి పని ఇవ్వకుండానే జీతాలు చెల్లిస్తున్నారని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసి వారి నుంచి పని తీసుకోవాలని...వారికి పని ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోతే సంతకాలు చేయడానికి మాత్రమే హైదరాబాద్‌కు పిలిపించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement