బీపీఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి?
బీపీఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి?
Published Fri, Nov 11 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. అందులో క్రమబద్ధీకరణకు అర్హమైనవెన్ని.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలను తమ ముందుంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది.
‘గ్రేటర్’పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్‌స కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. రెండు రోజుల క్రితం మరోమారు విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ, దరఖాస్తుల పరిశీలనకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, బీపీఎస్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని అర్హమైనవి.. వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేశవరావును ఆదేశించింది.
Advertisement