ఇక స్వాధీనమే
అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు ప్రభుత్వ యోచన
మరోసారి తెరపైకి బీపీఎస్
రూ.250 కోట్ల ఆదాయంపై దృష్టి
అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించడం... ఒక్కోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం... దీన్ని సాకుగా తీసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం... ఇదీ ఇప్పటి వరకూ మనం చూస్తున్నది. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటోంది. క్రమబద్ధీకరణలు... కూల్చివేతలకు స్వస్తి చెప్పి... నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని ఏకంగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది.
సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో 125 చదరపు గజాలలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత క్రమబద్ధీకరణ... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోని వారి నుంచి క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సముపార్జనకు యత్నిస్తున్న ప్రభుత్వం...మలిదశలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) మళ్లీ అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో దశలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోని వారి అక్రమ నిర్మాణాలను స్థానిక సంస్థలే స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ ...త రువాత దశలో తెలంగాణ రాష్ట్రమంతటా దీన్ని వర్తింపజేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది.
పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
జీహెచ్‌ఎంసీలో అనుమతి పొందిన ప్లాన్‌కు మించి అదనంగా నిర్మాణాలు చేపట్టడం... ఆమోదం పొందకుండానే నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో 2007 డిసెంబర్ 31న జారీ కాగా... పలుమార్లు పొడిగించారు. అలా 2010 వరకు అవకాశం కల్పించారు. దీనికోసం జీహెచ్‌ఎంసీకి 2.05 లక్షల దరఖాస్తులు రాగా.... ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన 55,901 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,44,353 దరఖాస్తులు బీపీఎస్ నిబంధనల మేరకు ఉండడంతో భవనాలు క్రమబద్ధీకరించారు. మిగతా దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలు లేకపోవడం, ఫీజులు చెల్లించకపోవడం, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉంచారు. బీపీఎస్ ద్వారా జీహెచ్‌ఎంసీకి అప్పట్లో దాదాపు రూ.868 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించుకున్న వారికీ అవకాశం కల్పించడంతో పాటు ఇదే చివరి గడువని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల అప్పట్లో తిరస్కరణకు గురైన వారు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కలగనుంది. గతంలో అవకాశాన్ని వినియోగించుకోని వారితో పాటు ఆ తర్వాత కొత్తగా వచ్చిన అక్రమ నిర్మాణాలు కలిపి దాదాపు లక్షన్నర వరకు ఉండవచ్చుననే ది అంచనా. వీటితో పాటు ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలు కలిపితే సుమారు రెండు లక్షల దాకా ఉంటాయని భావిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనివి కావడంతో గతంలో వచ్చినంత కాకపోయినా రూ. 200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని టౌన్ ప్లానింగ్ నిపుణుల అంచనా.
స్వాధీనమే పరిష్కారమని...
భవిష్యత్‌లో తిరిగి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీక రణకు ఇదే చివరి అవకాశంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే... నిబంధనలు ఉల్లంఘించినంత మేరకు భవనంలోని భాగాన్ని జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోనుంది. అలా స్వాధీనం చేసుకున్న వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడమో లేక వేలం ద్వారా విక్రయించడమో చేయాలనే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి అవసరమైన చట్ట సవరణ, నిబంధనలపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు అక్రమంగా వెలసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుండటం తెలిసిందే. తద్వారా ఎంతో సంపద నష్టం కావడమే కాక... కొంతకాలానికి తిరిగి వెలుస్తున్నాయి. కొత్తగా అమల్లోకి తేనున్న ‘స్వాధీనం’ యోచనతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఒకఅంతస్తుకు అనుమతి పొంది.. రెండు, మూడంతస్తులు.... నాలుగంతస్తుల వరకు అనుమతి ఉంటే అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి అదనపు అంతస్తులను స్వాధీనం చేసుకోవడం వల్ల అక్రమాలు పునరావృతం కావని భావిస్తున్నారు. దీనివల్ల జీహెచ్‌ఎంసీకి వచ్చే రాబడి కంటే ప్రజలు అక్రమాల జోలికే వెళ్లకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
బీపీఎస్.. దరఖాస్తులు.. పరిష్కారం
2007 డిసెంబర్ 31న బీపీఎస్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెలువరించింది.
2007 డిసెంబర్ 15 కన్నా ముందు నిర్మించిన అక్రమ భవనాలకే ఇది వర్తిస్తుంది.
బీపీఎస్ కోసం జీహెచ్‌ఎంసీకి అందిన మొత్తం దరఖాస్తులు: 2,05,006
పరిష్కారమైనవి: 1,44,353 తిరస్కరించినవి: 55,901
బీపీఎస్ ద్వారా జీహెచ్‌ఎంసీకి వచ్చిన ఆదాయం: రూ.868.87 కోట్లు
బీపీఎస్‌కు ముగింపు పలికింది: 31 మే 2013