BPS
-
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ అంటే ఎంసీఎల్ఆర్ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్ఆర్ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్ఆర్పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇంట్రస్ట్ రేట్లు ఎస్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్ఆర్ రేట్లు టెన్యూర్‌ను బట్టి మారాయి. ఆ వడ్డీ రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసుకుందాం. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. 6నెలల టెన్యూర్ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి వన్ ఇయర్ టెన్యూర్ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. అదనపు భారం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. చదవండి: తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్! -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి శుభవార్త.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) పెంచినట్లు తన వెబ్సైట్లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు: డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని నిర్వహించిన వారం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రస్తుతం వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును ప్రస్తుతానికి మార్చకుండా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు, ఇది గత 20 సంవత్సరాలలో కనిష్టం. -
బీపీఎస్‌లో మాయాజాలం
ప్రతి పని పారదర్శకంగా, వేగంగా చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ చేస్తోంది. అంతేకాకుండా స్థానికంగానే పనులు జరిగేలా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. కానీ నగరపాలక సంస్థలో మాత్రం సేవలు ఆఫ్‌లైన్ అయ్యాయి. అతిముఖ్యమైన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. కొందరు లైసెన్స్ ఇంజనీర్లు ఫైలు ఆన్లైన్ వరకూ కూడా రాకుండా చక్రం తిప్పుతున్నారు. సాక్షి, అనంతపురం : నగరపాలక సంస్థకు ఆదాయం తీసుకువచ్చే వాటిలో టౌన్ ప్లానింగ్ ప్రధానమైనది. సంస్థ పరిధిలో గృహ నిర్మాణం మొదలుకొని కాంప్లెక్స్, అపార్ట్మెంట్స్ నిర్మాణాల వరకూ టౌన్‌ప్లానింగ్ అనుమతులు తీసుకోవాలి. అనివార్య కారణాల వల్ల అనుమతి లేకుండా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టింది. దీని వల్ల అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు వీలుకలుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్ మేళా కూడా నిర్వహించింది. అయినా ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో గడువు కూడా డిసెంబర్ వరకూ పొడిగించింది. అయినా అనుకున్న మేర స్పందన కనిపించడం లేదు. కారణాలు ఆరా తీస్తే దీని వెనుక కొంతమంది లైసెన్స్ సర్వేయర్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం సేవలన్నీ సచివాలయాలకు అప్పగిస్తున్నారు. దీంతో కొందరు లైసెన్స్ సర్వేయర్లు టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ఫైళ్లను సచివాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే మొకాలడ్డుతున్నారు. ఫైలు సచివాలయానికి వెళ్తే అక్కడ ఏదైనా కొర్రీలు వేస్తే తమకు అందాల్సిన అందకుండా పోతాయని తాత్సారం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉండే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమీపంలోనే సచివాలయాలను ఏర్పాటు చేసి వేగవంతమైన సేవలందిస్తోంది. నగరంలో 50 డివిజన్లుండగా దాదాపు 74 సచివాలయాలున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ద్వారా పొందే సేవలన్నీ సచివాలయాల ద్వారానే పొందవచ్చు. గృహ నిర్మాణ అనుమతులు కూడా ఇటీవల దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అందజేస్తున్నారు. అయితే తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది లైసెన్స్ ఇంజనీర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తులు సచివాలయాల్లోని ప్లానింగ్ సెక్రటరీల వద్దకు గానీ వెళ్లకుండా ఆన్లైన్ లాగిన్‌లో అప్లోడ్ చేయడం లేదు. ఇప్పటి వరకూ ఇలా 460 దరఖాస్తుల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా కనీసం రూ. 5 కోట్ల వరకూ నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే భవన యజమానుదారులను ఇబ్బందులు పెట్టడం వల్ల తమ చేయి తడుస్తుందనో... లేక మరో దురుద్దేశమో తెలియదు కానీ 460 దరఖాస్తులు లైసెన్స్ ఇంజనీర్లు లాగిన్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఇంజనీర్లవే దాదాపు 200 దరఖాస్తులు ఉండడం గమనార్హం. బీపీఎస్ ఇలా... *అనుమతలు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్ అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో భవన యజమాని లైసెన్స్డ్ ఇంజినీర్‌ను సంప్రదించాలి. * లైసెన్స్డ్ ఇంజినీర్ ఇంటి కొలతలు, ఇతర సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. *దరఖాస్తు వార్డు సచివాలయానికి వెళ్తుంది. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలించి రిమాక్స్ రాసి పంపుతారు. ఇది టౌన్‌ప్లానింగ్‌కు వెళితే...వారు వెళ్లి పరిశీలన చేస్తారు. *అన్నీ సవ్యంగా ఉంటే...ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే బీపీఎస్ పూర్తవుతుంది. * కానీ ఫైలు సచివాలయానికి వెళితే పని కాదని భావిస్తున్న కొందరు లైసెన్స్ సర్వేయర్లు దాన్ని పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. రెండు వారాలు గడువిచ్చాం బీపీఎస్ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొన్ని షార్ట్‌ఫాల్స్ గుర్తించాం. సరిచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ఇలా ఇప్పటి వరకూ 460 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లైసెన్స్ ఇంజనీర్లు వారి లాగిన్‌లోనే ఉంచుకున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. అందరికీ రెండు వారాలు గడువు విధిస్తూ నోటీసులు జారీ చేస్తున్నాం. ఆ తర్వాత వారి లాగిన్లను బ్లాక్ చేస్తాం. అనంతరం క్రమబద్ధీకరించుకోని భవనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రామలింగేశ్వర రెడ్డి, ఏసీపీ, నగరపాలక సంస్థ అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసరావు(పేరు మార్చాం) తన భవనాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. బీపీఎస్ మంజూరు చేసేందుకు ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ (షార్ట్‌ఫాల్) అధికారులు నోటీసులు పంపారు. దాదాపు రెండు నెలలుగా ఈ దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. సంబంధిత లైసెన్స్ ఇంజనీర్ బీపీఎస్ మంజూరులో నెలకొన్న ఇబ్బందులను భవన యజమానికి తెలియపర్చకుండా నాన్చుతూ వస్తున్నారు. ఇది తెలియని భవన యజమాని మాత్రం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ రోజూ తిరుగుతున్నారు. అలాంటి వారు నగరంలో వందల్లో ఉన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థ ఖజానాకు సకాలంలో డబ్బులు చేరక అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. -
బీపీఎస్లోనూ దోచేస్తున్నారు..
సాక్షి, అమరావతి: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల నిర్మాణం ఉధృతమైంది. కమర్షియల్ ఏరియాల్లో ఈ తాకిడి అధికంగా ఉంది. అనేక పట్టణాలు, నగరాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కుమ్మక్కై బీపీఎస్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనుకుంటే.. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోటీపడి తమ ఆదాయం పెంచుకునే పనిలో మునిగిపోయారు. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి భవన యజమానులను, బిల్డర్లను ప్రోత్సహిస్తూ అక్రమంగా ఫ్లోర్లు, కట్టడాలు నిర్మింపజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోయినా కూడా.. బీపీఎస్ వివరాలు చెప్పి మరీ వారిని అక్రమ నిర్మాణాలకు పురిగొల్పుతున్నారు. 1985 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 31లోపు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడైనా సరే పది, పదిహేను రోజుల్లో ఇష్టమొచ్చినట్లుగా అదనపు ఫ్లోర్లు, ఇతర నిర్మాణాలు పూర్తిచేసుకుంటే.. వాటిని గతేడాది ఆగస్టు 31లోపే నిర్మించినట్టు రికార్డుల్లో చూపిస్తామంటూ భవన యజమానులకు ఎర వేస్తున్నారు. అలా చేసినందుకు తమకు కొంత ముట్టజెప్పాలని డీల్ మాట్లాడేసుకొని.. పని పూర్తి చేస్తున్నారు. అనుకున్న సమయంలోగా నిర్మాణం పూర్తి కావడానికి అవసరమైన సెంట్రింగ్, రెడీమిక్స్ వాహనాలను సైతం వీరే సమకూరుస్తున్నారు. ప్రాంతం, విస్తీర్ణం ఆధారంగా లక్ష నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్లయితే అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను సైతం తమ పేరున రాయించుకుంటున్నారు. అక్రమార్కులకు చేతులు కలిపిన ప్రభుత్వ సిబ్బంది.. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, 14 నగరపాలక సంస్థలు, 8 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిల్లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఈనెల 4న మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్నుంచి 90 రోజుల్లోగా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఇలాంటివి రాష్ట్రంలో దాదాపు 20 వేల కట్టడాలున్నట్టు మున్సిపల్ అధికారులు అంచనాకు వచ్చారు. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని మున్సిపల్ శాఖ భావించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్‌మెన్ మొదలు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి.. క్రమబద్ధీకరణ చేసుకునేలా భవన యజమానులను హెచ్చరించాలి. అయితే ఇందుకు భిన్నంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది టీడీపీ నేతలతో చేతులు కలిపి.. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. నిబంధనల ప్రకారం గత ఆగస్టు 31లోపు నిర్మించిన అక్రమ కట్డడాలనే క్రమబద్ధీకరించాల్సి ఉందని.. కానీ ఇప్పుడు నిర్మించినా కూడా వాటిని గత ఆగస్టులోపే కట్టినట్టు రికార్డుల్లో చూపిస్తామని భవన యజమానులకు ఎర వేస్తున్నారు. దీంతో కొందరు బిల్డర్లు, భవన యజమానులు.. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పినట్లుగా రాత్రికిరాత్రి అక్రమంగా ఫ్లోర్లకుఫ్లోర్లు నిర్మించి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. విజయవాడలో.. విజయవాడలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన గురునానక్ నగర్ ప్రారంభంలోనే ఒక భవనంపై రాత్రికి రాత్రి అనధికారికంగా ఒక ఫ్లోర్ వేసేశారు. టీడీపీ నేతల ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ నిర్మాణానికి సహకరించారని చెబుతున్నారు. దీని కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముడుపులు చేతులు మారేయనే విమర్శలు వినపడుతున్నాయి. అలాగే భవానీపురం బైపాస్ రోడ్‌ను ఆనుకుని ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు సమీపంలోని ఒక భవనానికి బిల్డర్ జి+3 ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం సెల్లార్‌ను పార్కింగ్‌కు కేటాయించాలి. అయితే సెల్లార్‌ను పార్కింగ్‌కు వదలకుండా దానికి కూడా గోడలు నిర్మించి.. దుకాణాలకు అద్దెకిచ్చేందుకు అనువుగా షట్టర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్.. తన కార్యాలయంలోని ఉద్యోగులతో పాటు అధికారులకు కూడా వాటాలు పంచినట్లు సమాచారం. -
బీపీఎస్‌కు స్పందన కరువు
మార్కాపురం టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగిసిపోయింది. జిల్లాలో ఇంకా చాలా మంది క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాలేదు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో జీప్లస్ వన్ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్ చేయాలి. 300 స్క్వేర్ మీటర్ల నుంచి వెయ్యి స్క్వేర్ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలి. వెయ్యి స్క్వేర్ మీటర్లు దాటితే (4 అంతస్తుల పైన) హైదరాబాదులోని మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురంతోపాటు జిల్లాలో మున్సిపాలిటీలలో కొన్నేళ్లుగా అపార్ట్మెంట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో పాటు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనధికార కట్టడాలకు మున్సిపల్ అధికారులు అపరాధ రుసుం విధిస్తున్నారు. కాగా, పురపాలక సంఘం పరిధిలో 1 జనవరి 1985 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఏప్రిల్ 30తో ముగిసింది. తదుపరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా 1985 నుంచి 2014లోపు నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని నిబంధన విధించింది. దీంతో జిల్లాలోనే మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను గుర్తించి అధికారులు సుమారు 7 వేల భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బిల్డింగ్ పీనలైరైజేషన్ పథకంలో భాగంగా 3,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 2,215 మంది క్రమబద్ధీకరించుకోగా, 1130 దరఖాస్తులు పరిష్కరించుకోవాల్సి ఉంది. మామూలుగా భవన నిర్మాణదారులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ అధికారులు డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్‌ను పరిశీలించి సదరు బిల్డింగ్ వద్దకు వెళ్లాలి. అక్రమ కట్టడాలను గుర్తించి అపరాధ రుసుం విధించిన అనంతరం ఆ బిల్లును కట్టి బిల్డింగ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. కష్టపడి పదివేలు డిపాజిట్ చెల్లించి ఆన్లైన్ చేయించుకుని వచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడానికి అనువైన పరికరాలు మున్సిపాలిటీలో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎంతెంత దూరం...
లక్ష్యం చేరని బీపీఎస్ అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ అంతంతమాత్రమే అవకాశమిచ్చినా ఉత్సాహం చూపని జనం ధర్మవరం : మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ(బీపీఎస్) కార్యక్రమం లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. అక్రమంగా భవనాలను నిర్మించుకున్న వారు బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్) స్కీం కింద దరఖాస్తు చే సి కూడా రెగ్యులరైజ్ చేసుకోకుండా మిన్నకుండి పోయారు. దీంతో మున్సిపాలిటీల ఆదాయానికి భారీగానే గండి పడుతోంది. బీపీఎస్‌కు ధరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 55 శాతం మంది మాత్రమే మున్సిపాలిటీకి అపరాధ రుసుము చెల్లించి తమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. బీపీఎస్ విషయంలో మున్సిపల్ అధికారులు భవన యజమానుల పట్ల సుతిమెత్తగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత వల్ల బీపీఎస్‌ను పట్టించుకునే వారు లేకపోవడం , ఉన్న కొద్ది మంది అధికారులు పని ఒత్తిడి కారణంతో మున్సిపాలిటీలకు భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చే ఈ ప«థకంపై సరిగా మానిటరింగ్ చేయలేకపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రూ.10 వేలు చెల్లించినా... మున్సిపాలిటీలలో నిర్మించిన అనధికార భవనాలు, ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించుకునేలా 2015 మే నుంచి 2016 ఏప్రిల్ వరకు ఆన్లైన్ ద్వారా బీపీఎస్ దరఖాస్తులను స్వీకరించారు. అనుమతులు లేకుండా నిర్మించుకున్న భవన యజమానులు మొదట రూ.10 వేలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలోలో 1068, మిగిలిన 11 మున్సిపాలిటీల పరిధిలో 1029 మంది ఈ బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాటన్నింటినీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన మొత్తం 2097 దరఖాస్తుల్లో ఇప్పటి దాకా కేవలం 1173 దరఖాస్తులు ఆమోదం పొందగా 19 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 905 ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 70 మంది బీపీఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకోగా. 39 మంది మాత్రమే అపరాధ రుసుం చెల్లించి రెగ్యులర్ చేసుకోగా, మిగిలిన 31 మంది ఇంకా రెగ్యులర్ చేసుకోలేదు. సిబ్బంది కొరతతో కొంత జాప్యం జరుగుతుండగా... ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుములకు భయపడి ఈ స్కీంకు దరఖాస్తు చేసుకున్నా..రెగ్యులర్ చేసుకోవడానికి మురికొందరు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 31 వరకు గడువు : బీపీఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 31వ తేది వరకు తమ భవనాలను రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించారు. బీపీఎస్‌కు వచ్చిన దరఖాస్తులు ఇలా.. మున్సిపాలిటీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవి రెగ్యులర్ చేసినవి తిరస్కరించినవి అనంతపురం (కార్పొరేషన్) 1068 459 608 1 ధర్మవరం 70 31 39 0 గుత్తి 25 14 10 0 హిందూపురం 165 42 123 0 కదిరి 31 15 16 0 గుంతకల్లు 290 76 213 1 కళ్యాణదుర్గం 24 10 14 0 మడకశిర 14 4 8 2 పుట్టపర్తి 36 31 5 0 పామిడి 10 1 8 1 రాయదుర్గం 45 22 9 14 తాడిపత్రి 319 200 119 0 -
బీపీఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. అందులో క్రమబద్ధీకరణకు అర్హమైనవెన్ని.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలను తమ ముందుంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ‘గ్రేటర్’పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. రెండు రోజుల క్రితం మరోమారు విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ, దరఖాస్తుల పరిశీలనకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, బీపీఎస్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని అర్హమైనవి.. వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేశవరావును ఆదేశించింది. -
కుప్పల తెప్పలు
-బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం - నెలాఖరు వరకు గడువు - జిల్లాలో 3 వేల దరఖాస్తులు పెండింగ్ తణుకు : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులు మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ కార్యాలయాల్లో కుప్పలుగా పడివున్నాయి. వాటి పరిష్కారం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద భవన యజమానుల నుంచి నిర్ధేశిత ఫీజుల వసూలు గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదిలో నాలుగోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడటం విశేషం. బీపీఎస్ దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో నిర్ధేశిత సొమ్ము చెల్లించే విషయంలో భవన యజమానుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూరడం లేదు. పరిష్కారం అంతంతే.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలకు 4,634 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,319 మాత్రమే పరిష్కారమయ్యాయి. 3,313 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది మే 22న బీపీఎస్ ప్రకటించిన మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అదే నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. స్పందన లేకపోవడంతో తొలుత రెండు నెలలు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించింది. తర్వాత పలుమార్లు పొడిగించుకుంటూ గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నా ఆన్లైన్లో సమస్యల కారణంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారు. దీంతో 3,313 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
కుప్పల తెప్పలు
- బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం -నెలాఖరు వరకు గడువు - జిల్లాలో 3 వేల దరఖాస్తులు పెండింగ్ తణుకు : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులు మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ కార్యాలయాల్లో కుప్పలుగా పడివున్నాయి. వాటి పరిష్కారం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద భవన యజమానుల నుంచి నిర్ధేశిత ఫీజుల వసూలు గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదిలో నాలుగోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడటం విశేషం. బీపీఎస్ దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో నిర్ధేశిత సొమ్ము చెల్లించే విషయంలో భవన యజమానుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూరడం లేదు. పరిష్కారం అంతంతే.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలకు 4,634 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,319 మాత్రమే పరిష్కారమయ్యాయి. 3,313 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది మే 22న బీపీఎస్ ప్రకటించిన మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అదే నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. స్పందన లేకపోవడంతో తొలుత రెండు నెలలు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించింది. తర్వాత పలుమార్లు పొడిగించుకుంటూ గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నా ఆన్లైన్లో సమస్యల కారణంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారు. దీంతో 3,313 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ
• గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు • అర్హత లేని వాటిని తేల్చాక చర్యలు తీసుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మంగళవారం సవరించింది. బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది. దరఖాస్తుల తిరస్కరణ ఉత్తర్వులను ఆయా దరఖాస్తుదారులకు అందజే శాక, సదరు అక్రమ నిర్మాణాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. అర్హత ఉన్న ట్లు తేలిన దరఖాస్తుల విషయంలో ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఎలాం టి ఉత్తర్వులూ జారీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులకు సూచించింది. దీనిపై పూర్తి వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని గ్రేటర్, ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులి చ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అక్ర మ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, దీని నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో దీన్ని విచారించిన కోర్టు బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేయవచ్చునని, క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ దరఖాస్తులు తిరస్కరించండి... పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాల పై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశా రు. గతంలో బీపీఎస్ తీసుకొచ్చిన ప్రభుత్వం వన్‌టైమ్ స్కీమ్ అని చెప్పిందని, అయితే మళ్లీ మళ్లీ అక్ర మ భవనాలను క్రమబద్ధీకరిస్తూ వెళ్తోందన్నారు. భారీ ఉల్లంఘనలతో చేసిన నిర్మాణాలను సైతం క్రమబద్ధీకరిస్తున్నారని, దీని ద్వారా అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారన్నారు. దీనికి జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ... బీపీఎస్ దరఖాస్తుల గడువు ముగిసిందని, ఎప్పటి లోపు పూర్తయిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. అలా అయితే ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగి శాక చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలివ్వాలని శ్రీనివాస్ ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు అంగీకరిం చిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. -
క్రమ బద్ధకం..
బీపీఎస్‌కు స్పందన నామమాత్రం పరిష్కారంలోనూ జాప్యం నెలాఖరుతో గడువు పూర్తి కొవ్వూరు : పురపాలక సంఘాల్లో అనధికార భవనాల క్రమబద్ధీకరణ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం–బీపీఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా ఈ పథకం గడువును సర్కారు మరోనెల పొడిగించింది. జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతీ, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి. వీటిల్లో సుమారు 8వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వం భవన క్రమబద్ధీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1985 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్ 31లోపు నిర్మించిన అనధికార నిర్మాణాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. దీనికి సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే అక్రమ నిర్మాణదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మరోనెల రోజుల గడువు పెంచుతూ జీవో నంబర్ 234 జారీ చేసింది. అక్టోబర్ 30తో ఈ గడువు పూర్తికానుంది. అయినా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 4,634 దరఖాస్తులందాయి. వీటిలో 1,313 నిర్మాణాలను మాత్రమే అధికారులు క్రమబద్ధీకరించారు. మరో 3,313 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వివిధ కారణాలతో 541 అర్జీలను పెండింగ్‌లో పెట్టారు. ఏలూరులో ఒకటి, తాడేపల్లిగూడెంలో ఒక దరఖాస్తును తిరస్కరించారు. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.19.17 కోట్లు ఆదాయం సమకూరింది. కేవలం 28.46 శాతం అక్రమ కట్టడాలను మాత్రమే క్రమబద్ధీకరించారు. జనవరి నుంచి పెరుగుతున్న గడువు వాస్తవానికి జిల్లాలో క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు జనవరితోనే ముగిసింది. స్పందన సరిగా లేకపోవడంతో ప్రభుత్వం అప్పటి నుంచి గడువు పెంచుతూ వస్తోంది. తొలుత జూలై నెలాఖరుకు గడువు పెంచిన సర్కారు ఆ తర్వాత సెప్టెంబర్ 30కి, తాజాగా అక్టోబర్ నెలాఖరుకు పెంచింది. ఇప్పుడు మరో 15 రోజులే గడువున్నా, అక్రమ నిర్మాణదారుల నుంచి స్పందన లేదు. జిల్లాలో భీమవరం, తణుకు పురపాలక సంఘాల్లో అనధికారిక నిర్మాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మొత్తం అక్రమ కట్టడాల్లో సగం ఈ రెండు పట్టణాల్లోనే ఉన్నాయని సమాచారం. ఇప్పటికే భీమవరం పురపాలక సంఘానికి బీపీఎస్ ద్వారా రూ.6.67 కోట్లు, తణుకు మునిసిపాలిటీకి రూ.2.80 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. నరసాపురం ఫస్ట్ అక్రమ క్రబద్ధీకరణ పథకం అమలులో నరసాపురం మునిసిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. 76.76 శాతం క్రమబద్ధీకరణతో జిల్లాలో మొదటిస్థానం సాధించింది. జంగారెడ్డిగూడెం ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక్కడ అతితక్కువగా 13.75 శాతమే భవనాలను క్రమబద్ధీకరించారు. కొవ్వూరు, పాలకొల్లు పురపాలక సంఘాల్లోనూ బీపీఎస్‌కు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్లాన్ కాపీ, అటెస్టెడ్ దస్తావేజులు, యాజమాని ఆధార్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌కి అప్లోడ్ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి అపరాధ రుసుం సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాల వల్ల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరణ అయితే పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ....................................................................................... మునిసిపాలిటీ/ మొత్తం పరిశీలనలో పరిష్కారం కార్పొరేషన్ దరఖాస్తులు ఉన్నవి అయినవి .......................................................................................... ఏలూరు 695 432 262 భీమవరం 1,155 822 333 3.జంగారెడ్డిగూడెం 80 69 11 4.కొవ్వూరు 242 208 34 5.నరసాపురం 142 33 109 6.నిడదవోలు 122 76 46 7.పాలకొల్లు 566 464 102 8.తాడేపల్లిగూడెం 547 414 132 9.తణుకు 1,085 795 290 .......................................................................................... మొత్తం 4,634 3,313 1,319 .......................................................................................... -
బీపీఎస్ ఆదాయం రూ.72.86 కోట్లు
నిడదవోలు : మునిసిపల్ రీజియన్ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) ద్వారా 20,451 దరఖాస్తులు అందాయని, వీటి ద్వారా రూ.72.86 కోట్ల ఆదాయం సమకూరిందని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పీఎస్ఎన్ సాయిబాబు తెలిపారు. నిడదవోలులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీపీఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న భవన యజమానులు నిర్మాణాలు చేపట్టకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఈనెల 30లోపు వారి డాక్యుమెంట్టు అప్లోడ్ చేసుకుని మిగిలిన సొమ్మును వెంటనే చెల్లిస్తే ఆన్లైన్ ద్వారా అనుమతులు లభిస్తాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఎన్.హరిబాబు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ.. ఏదీ ఆదరణ
బీపీఎస్‌కు 4,200 దరఖాస్తులు ఇప్పటివరకు 82 భవనాలకు మాత్రమే అనుమతి సెప్టెంబర్ 30 వరకే గడువు అక్రమ, అనధికారిక నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) నత్తనడకన సాగుతోంది. దీని ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని కార్పొరేషన్ అధికారులు భావించారు. అయితే వివిధ కారణాలరీత్యా దరఖాస్తులు ఎక్కువగా రాలేదు. నెల్లూరు సిటీ : నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో అక్రమ, అనధికారిక కట్టడాలు సుమారు 15వేలకు పైగానే ఉన్నాయి. గతేడాది మే 27వ తేదీన బీపీఎస్ స్కీం అందుబాటులోకి వచ్చింది. కార్పొరేషన్ పరిధిలో సుమారు 10వేలకు పైగానే దరఖాస్తులు వస్తాయని, దీనిద్వారా కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు ఆదాయం సమకూరుతుందని టౌన్‌ప్లానింగ్ అధికారులు అంచనావేశారు. అయితే ఈ పథకం ఆశించినస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. తలకిందులైన అంచనాలు.. బీపీఎస్ స్కీం విషయంలో మేయర్ అజీజ్, కార్పొరేషన్ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అధికసంఖ్యలో దరఖాస్తులు, ఆదాయం వస్తుందని అప్పట్లో మేయర్ ప్రకటన చేశారు. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రాజకీయ బదిలీ కావడంతో స్కీం అమలులో వేగం తగ్గింది. అధికారులు సైతం ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లకపోవడంతో కేవంల 4,200 దరఖాస్తులే వచ్చాయి. పథకం ప్రారంభమైన తర్వాత హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. అయితే దీంతో ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆతర్వాత ప్రచార విషయం పట్టించుకోలేదు. క్రమబద్ధీకరణలో జాప్యం.. దరఖాస్తులు చేసుకున్న వారి ఫైల్స్‌ను మంజూరుచేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో బీపీఎస్‌లో ఫీజు చెల్లించిన వారికి ఎదురుచూపులు తప్పలేదు. తాము డబ్బులు చెల్లించినా క్రమబద్ధీరణ చేయకుండా తిప్పికుంటున్నారని భవన యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు ఇటీవల టౌన్‌ప్లానింగ్ విభాగంలోని టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను మంత్రి నారాయణ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో అధికారులను నియమించినప్పటికీ, కొందరు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. దీంతో బీపీఎస్ స్కీం కింద దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు లేకుండాపోయారు. కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు పరిశీలన ముందుకుసాగడం లేదు. మరికొద్దిరోజులే గడువు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువు తక్కువగా ఉంది. ఇప్పటికి 82 దరఖాస్తులను మంజూరుచేశారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే క్రమబద్ధీకరణకు అవకాశం ఉండటంతో తమ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా అని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. -
క్రమబద్ధీకరణకు కటాఫ్ అక్టోబర్ 26
* ఆలోపు ఏర్పాటైన భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం * ఎల్ఆర్ఎస్ ముసాయిదా సిద్ధం.. నేడు ఉత్తర్వుల జారీ! * పునర్విభజన చట్టం నిబంధనల ఆధారంగా మున్సిపల్ చట్టాల సవరణ * ఆ తర్వాత ‘బీపీఎస్’పై ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీని కటాఫ్‌గా ప్రభుత్వం ఖరారు చేసింది. భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్), లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలను ప్రవేశపెటేందుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 26న సంబంధిత ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదేరోజును కటాఫ్ తేదీగా తీసుకుని క్రమబద్ధీకరణ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 2015 అక్టోబర్ 26వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు, లేఅవుట్లనే క్రమబద్ధీకరిస్తారు. ఈ తేదీలోపు నిర్మితమైన భవనాలన్నింటినీ ‘గూగుల్ మ్యాప్స్’ సహకారంతో గుర్తించి క్రమబద్ధీకరించే అవకాశముంది. రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా పరిగణించాలనే ప్రతిపాదనలున్నప్పటికీ... రాష్ట్రంలో అనుమతి లేని భవనాలు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 26ను కటాఫ్‌గా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ కోసం తొలుత రెండు నెలల గడువు ఇచ్చి ఆ తర్వాత పొడిగించే అవకాశముంది. కాగా ఇప్పటికే ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ముసాయిదా ఉత్తర్వులను సిద్ధం చేసిన పురపాలక శాఖ శుక్రవారం తుది ఉత్తర్వులను జారీ చేసే అవకాశముంది. బీపీఎస్ ఉత్తర్వులకు మాత్రం మరికొన్ని రోజులు పట్టనుంది. పునర్విభజన చట్టంతో.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణపై న్యాయపర అడ్డంకులను తొలగించుకునేలా మున్సిపల్ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేషించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాలను సవరించడం కోసం ఆర్డినెన్స్‌కు బదులుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును ఉపయోగించుకోనుంది. 2014 జూన్ 2కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏ చట్టాన్నయినా తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుని (అడాప్ట్) చేసుకుని తమ అవసరాలకు తగ్గట్లు సవరణ చేసుకోవచ్చని ఈ చట్టం పేర్కొంటోంది. ఈ నిబంధన ఆధారంగానే ఏపీ మున్సిపల్ చట్టాలను ‘క్రమబద్ధీకరణ’కు అనువుగా సవరించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే బీపీఎస్ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఆ జిల్లాలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకం అమలు కానుంది. లేకుంటే వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో ఈ పథకాల్ని అమలు చేసి, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్‌లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. -
బీపీ‘ఎస్’!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో మళ్లీ బీపీఎస్/బీఆర్ఎస్ అమలుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో బీపీఎస్ అమలుపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు దీని అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను రెండు వారాల క్రితం ప్రభుత్వానికి పంపించారు. సీఎం నుంచి ఆదేశాలు అందగానే జీవో వెలువడే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆరోపణలకు... అవకతవకలకు తావులేకుండా అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. బీపీఎస్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించాలని... మాన్యువల్‌గా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదనే నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ఏ దరఖాస్తు ఎప్పుడు అందిందో తెలియడమేకాక... ఫైలు ఎప్పుడు ఎవరి వద్ద ఉందో తెలిసే వీలుంటుందని భావిస్తున్నారు. పక్కాగా విధి విధానాలు గతంలో బీపీఎస్ అమలైనప్పుడు పాత తేదీలతో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, డూప్లికేట్ స్టాంపులు వేసి బీపీఎస్ కింద క్రమబద్ధీకరించినట్లు తప్పుడు సర్టిఫికెట్లు అందజేసిన ఘటనలు వెల్లడయ్యాయి. నిర్ణీత గడువు తర్వాత వెలసిన అక్రమ భవనాలను సైతం ఇబ్బడిముబ్బడిగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని భవనాలకు సంబంధించి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అలాంటివి పునరావృతం కాకుండా ఈసారి ముందే విధి విధానాలను రూపొందించి... కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అమలవుతున్న ఈ-ఆఫీసు వల్ల ఏ ఫైలు ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్‌కు.. ఎప్పుడు వెళ్లిందీ సమయంతో సహా తెలుస్తోంది. భవనాల అనుమతుల దరఖాస్తుల వంటివి నేరుగా తీసుకొని స్కాన్ చేసి ఈ-ఆఫీస్‌లో ఉంచుతున్నారు. బీపీఎస్ దరఖాస్తులను మాత్రం ఆన్లైన్లో స్వీకరించడాన్ని తప్పనిసరి నిబంధనగా చేయనున్నట్లు తెలిసింది. పార్కింగ్‌పై కఠిన వైఖరి విశ్వ నగరానికి బాటలు వేస్తున్న తరుణంలో విశాలమైన రహదారులు.. పచ్చని మైదానాలే కాక భవనాలు, వీధులు క్రమపద్ధతిలో ఉండాలి. ఇరుకు స్థలంలో వెలసిన భారీ భవనాలను క్రమబద్ధీకరిస్తే వికృతంగా కనిపిస్తాయి. క్రమబద్ధీకరించని పక్షంలో బీఆర్ఎస్ను తమకు వర్తింపజేయలేదంటూ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు వేసిన వారు గగ్గోలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నగరంలో ఇలాంటివే అధికం. ఈ నేపథ్యంలో ఏమేరకు అక్రమ నిర్మాణాలను అనుమతించాలనే అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో పార్కింగ్ సమస్య తీవ్రత దృష్ట్యా కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచా రం. ప్రస్తుతం జంక్షన్ల వద్ద కొత్త భవనాలకు అనుమతులివ్వడం లేదు. రహదారుల విస్తరణ, మల్టీ ఫ్లై ఓవర్లు రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 1000 కోట్ల ఆదాయం బీపీఎస్‌తో ఈ ఆర్థిక సంవత్సరం రూ.500 కోట్లు, ఎల్ఆర్ఎస్తో రూ.300 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన అధికారులు జీహెచ్ఎంసీ బడ్జెట్లోనూ దీనిని చూపించారు. దాదాపు వెయ్యి కోట్ల వరకు రాగలదని అంచనా. బీపీఎస్ దరఖాస్తులు 60 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చునని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, మల్టీలెవెల్ గ్రేడ్సెపరేటర్లకు బీపీఎస్ ఆదాయం ఉపయోగపడుతుందనేది మరో ఆలోచన. మళ్లీ దరఖాస్తు చేయాలి గతంలో గడువులోగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించని కారణంగా కొంతమంది క్రమబద్ధీకరించుకోలేకపోయారు. కొత్తగా బీపీఎస్‌ను అమల్లోకి తెస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. వారు ఇప్పటికే చెల్లించిన ఫీజులను కొత్త దరఖాస్తులకు బదిలీ చేసే వీలుందని పేర్కొన్నారు. 2007లో బీపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయం బీపీఎస్‌కు వచ్చిన దరఖాస్తులు : 2,05,006 పరిష్కారమైనవి : 1,44,353 జీహెచ్ఎంసీ ఆదాయం : రూ. 868.87 కోట్లు -
బీపీఎస్...కథ అడ్డం తిరిగింది!
- సర్కారు ప్రకటనతో పెరిగిన అక్రమాలు - విచ్చలవిడిగా నిర్మాణాలు - ప్రకటన వెలువడి .. జీవో రాకపోవడంతో పెచ్చుమీరుతున్న డీవియేషన్లు - అందినకాడికి దండుకుంటున్న అధికారులు బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)... ఇది అక్రమాలను నిరోధించే పథకం. కానీ.. ఇదే ఇప్పుడు అక్రమార్కులకు రక్షణగా మారుతోంది. ఎలాగూ బీపీఎస్ కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తారనే ధీమాతో అడ్డగోలు నిర్మాణాలకు తెరలేపారు. ఒకప్పుడు భయంతో వణికిన వారు సైతం యథేచ్ఛగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. అతిక్రమణలకు పాల్పడుతున్నారు. సర్కారు ఒకటి తలిస్తే... వాస్తవానికి జరుగుతోంది మరోలా ఉంది. అక్రమార్కులకు అధికార యంత్రాంగం సైతం సహకరిస్తోందన్న ఆరోపణలున్నాయి. సాక్షి సిటీబ్యూరో: అనుకున్నదొకటి.. అయ్యింది ఒకటి ..అన్న చందంగా మారింది త్వరలో అమల్లోకి రానుందని భావిస్తున్న బీపీఎస్ వ్యవహారం. ఒకసారి బీపీఎస్‌కు అనుమతివ్వడం ద్వారా తిరిగి అక్రమ నిర్మాణాలకు తావివ్వరాదనే తలంపులో ఉన్న ప్రభుత్వం ఆమేరకు ప్రకటన చేసింది. విశ్వనగరంగా ఎదిగే క్రమంలో అడ్డదిడ్డంగా..అక్రమ నిర్మాణాలు ఉండరాదని పకడ్బందీ ప్రణాళికతో నగర నిర్మాణం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీపీఎస్‌కు ఒకపర్యాయం అవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రకటన వెలువడ్డాక దాదాపు మూడునెలలుగా ఆ విషయంపై ఎందుకనో నిర్ణయం తీసుకోలేదు. వెంటనే జీవో వెలువరించి.. మార్గదర్శకాలు జారీ చేస్తే ఈపాటికే క్రమబద్ధీకరణ ప్రారంభమయ్యేది. కానీ అలా జరగకపోవడంతో తిరిగి ఎలాగూ బీపీఎస్ వస్తుంది కనుక, ఇదే మంచి అదను అనుకొని కొందరు అడ్డదిడ్డంగా అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. రెండంతస్తులకు అనుమతులున్న వారు అదనపు అంతస్తులు నిర్మిస్తుండగా, అసలు అనుమతుల్లేకుండానే వెలుస్తున్న భవనాలకూ అంతూపొంతూ లేకుండా పోతోంది. ఇలా ఒక సర్కిల్ పరిధిలో అని కాకుండా నగరమంతా ఇదే తంతు నడుస్తోంది. అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇదే మంచి తరుణమని, మరోసారి అవకాశం రాదంటూ వారే నిర్మాణదారులకు సలహాలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకుగాను అనుమతుల్లేని నిర్మాణాలకు దాదాపు రూ. 2 నుంచి రూ. 4 లక్షలు , అదనపు అంతస్తులకు ఒక్కోదానికి రూ.లక్ష వంతున టౌన్‌ప్లానింగ్ సిబ్బింది వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తల్లకిందులైన ఆలోచన.. ఎలాగూ బీపీఎస్, ఎల్ఆర్ఎస్లు అమల్లోకి వస్తాయని తెలిసి జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూపాయి రాకలో వీటి ద్వారా రూ. 800 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. అవి గత మార్చికి ముందున్న అంచనాలు. దాదాపు గడచిన రెండున్నర నెలల కాలంలోనే అక్రమనిర్మాణాలు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. ఒక్క కూకట్పల్లి సర్కిల్లోనే దాదాపు వెయ్యి అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అంచనా. దీంతో క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి బీపీఎస్‌ను అమల్లోకి తేవడం వెనుక ఉద్దేశం ఉన్న అక్రమనిర్మాణాలను క్రమబద్ధీకరించి.. ఇకపై ఒక్క అక్రమనిర్మాణం కూడా రాకుండా చేయాలని. కానీ..ప్రకటన వెలువడిన నాటినుంచీ ఈ అక్రమాలు పెచ్చుమీరి పోయాయి. అక్రమనిర్మాణాలను అడ్డుకోవాల్సిందిగా జీహెచ్ంఎసీ ప్రధాన కార్యాలయం నుంచి సర్కిళ్ల అధికారులకు ఆదేశాందుతున్నా లెక్క చేస్తున్నవారు లేరు. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే నియంత్రిస్తామని, కూల్చివేతలు అంతిమచర్యలని గత సంవత్సరం గురుకుల్ట్రస్ట్లో కూల్చివేతల సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్రమాలను ప్రోత్సహించిన అధికారులనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అక్రమ నిర్మాణాలు ఆగడం లేవు. బీపీఎస్ ప్రకటనతో మరింత విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అధికం.... గచ్చిబౌలి/కూకట్పల్లి : జీహెచ్ఎంసీ ఆదాయంలో సింహభాగం శేరిలింగంపల్లి పరిధిలోని రెండు సర్కిళ్లదే. అక్కడి అధికారుల అవినీతి కూడా అదే రీతిలో ఉంటుంది. బీపీఎస్ అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ జంట సర్కిళ్లలో అక్రమ నిర్మాణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని సర్కిళ్లలో పనిచేసే టౌన్ ప్లానింగ్ అధికారులు స్లాబ్‌కు లక్ష చొప్పున దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జంట సర్కిళ్లలో 140 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అంచనా. శేరిలింగంపల్లి సర్కిల్-11లో 60కి పైగా, సర్కిల్-12లో 80కి పైగా అక్రమ నిర్మాణాలు వెలసినట్లు తెలుస్తోంది. సర్కిల్-11 పరిధిలో గచ్చిబౌలి, అంజయ్యనగర్, శ్రీరాంనగర్, మసీద్‌బండ, రాఫవేంద్రనగర్, రాజరాజేశ్వరీ కాలనీ, సిద్ధిఖీనగర్, సర్కిల్-12 పరిధిలోని చందానగర్, గోకుల్‌ప్లాట్స్, మక్తా మహబూబ్పేట్, బీకే ఎన్క్లేవ్, రెడ్డి ఎన్క్లేవ్, ప్రశాంత్‌నగర్‌లలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ డివిజన్లతో పాటు మూసాపేటలో అక్రమ నిర్మాణాలకు అడ్డులేకుండా పోయింది. గతంలో సర్కిల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు భారీ ప్రణాళికలు చేపట్టిన అధికారులు అనంతరం ఎందుకనో వెనక్కు తగ్గారు. సర్కిల్ పరిధిలో అడ్డగుట్ట సొసైటీ, సర్ధార్పటేల్నగర్, ఆంజనేయనగర్, మోతీనగర్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోనూ దాదాపు 300కు పైగా అక్రమనిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నిసర్కిళ్లలోనూ ఇదే తంతు సాగుతుండగా, శివారు ప్రాంతాల్లో అధికంగా ఉంది. -
మరోసారి బీపీఎస్
అమలాపురం టౌన్ : నగరాలు, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ (బీపీఎస్) చేయించుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. దీంతో నిర్మాణాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు భవన యజమానులకు వీలు కలగడంతో పాటు స్థానిక సంస్థలకు బోలెడు రాబడి రానుం ది. 1998, 2008 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు రెండుసార్లు అవకాశం ఇచ్చినా అక్రమ భవన నిర్మాణదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. తాజాగా ప్రభుత్వం మూడోసారి బీపీఎస్‌ను ఈనెల 27 నుంచి అమలు చేస్తోంది. జీవో నం:128తో మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనాల యజమానులకు గుబులు కలుగుతోంది. క్రమబద్ధీకరణ ఒక రకంగా వారికి అవకాశమే అయినా అందుకు నిర్ధారించిన ఫీజులు ఇప్పుడు తడిసి మోపెడై పెద్ద మొత్తాల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది. మున్సిపాలిటీల అనుమతులు లేకుండా కొందరు, అనుమతి పొందినా అధికారికంగా ఇచ్చిన ప్లాన్‌కు విరుద్ధంగా కొందరు భవనాలను నిర్మించారు. అప్పట్లో ఫీజుల చెల్లింపు నుంచి వారు కొంత ఉపశమనం పొందినా మున్సిపాలిటీలు మాత్రం ఎంతో ఆదాయాన్ని కోల్పోయాయి. రూ.50 కోట్లకు పైగా రాబడి జిల్లాలోని నగర, పుర పాలికల్లో దాదాపు 15 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉండవచ్చని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగరాల్లోనే దాదాపు ఎనిమిది వేల అక్రమ కట్టడాలు ఉండవచ్చు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, తుని, పెద్దాపురం మున్సిపాలిటీల్లో దాదాపు నాలుగు వేల అక్రమ నిర్మాణాలు ఉంటాయని అంచనా. బీపీఎస్‌లో అక్రమ భవనాలకు విధించే అపరాధ రుసుం ద్వారా జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు రూ.50 కోట్లకు పైగానే ఆదాయం రావచ్చని సర్కారు ఆశిస్తోంది. ఇవీ నిబంధనలు = బీపీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే అక్రమ నిర్మాణదారులు ఈనెల 27 నుంచి రానున్న 60 రోజుల్లో ఆన్లైన్ ద్వారా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. = దరఖాస్తుతో పాటు రూ.10 వేలు కనీస అపరాధ రుసుంగా చెల్లించాలి. = మిగిలినది స్థానిక సంస్థలు తెలియజేసిన 30 రోజులలోపు చెల్లించి భవనాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి. = ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే 30 రోజుల్లోపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీకి అప్పీలు చేసుకోవాలి. = 100 చదరపు మీటర్ల లోపు స్థలాల్లోని నేల లేదా అంతస్తు వరకూ గల నిర్మాణం ఈ బీపీఎస్‌కు వర్తించదు. = 1985 జనవరి 1 నుంచి 201 డిసెంబరు 31 మధ్య కాలంలో నిర్మించిన అనధికార కట్టడాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. = 1997 డిసెంబరు 31 కంటే ముందుగా నిర్మించిన భవనాలపై 25 శాతం, నోటిఫైడ్ స్లమ్స్‌లోని నిర్మాణాలపై 50 శాతం అపరాధ రుసుంలో తగ్గింపు అవకాశం ఉంటుంది. = దరఖాస్తుతో పాటు కనీస అపరాధ రుసుం, డిక్లరేషన్, గతంలో మంజూరు చేసిన ప్లాను (ఉంటే) భవనం తాలూకు ఫోటోలు, భవన యాజమాన్య పత్రం, ఇన్డెమ్నిటీ బ్యాండు, 3 జతల ప్లానుల స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ అందజేయాలి. = అక్రమ లే అవుట్ల భవనాలు, ప్రభుత్వ స్థలాలు, రిజర్వుడు స్థలాలు తదితర అధికారిక స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలకు బీపీఎస్ వర్తించదు. -
ఇక స్వాధీనమే
అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు ప్రభుత్వ యోచన మరోసారి తెరపైకి బీపీఎస్ రూ.250 కోట్ల ఆదాయంపై దృష్టి అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించడం... ఒక్కోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం... దీన్ని సాకుగా తీసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం... ఇదీ ఇప్పటి వరకూ మనం చూస్తున్నది. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటోంది. క్రమబద్ధీకరణలు... కూల్చివేతలకు స్వస్తి చెప్పి... నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని ఏకంగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో 125 చదరపు గజాలలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత క్రమబద్ధీకరణ... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోని వారి నుంచి క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సముపార్జనకు యత్నిస్తున్న ప్రభుత్వం...మలిదశలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) మళ్లీ అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో దశలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోని వారి అక్రమ నిర్మాణాలను స్థానిక సంస్థలే స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ ...త రువాత దశలో తెలంగాణ రాష్ట్రమంతటా దీన్ని వర్తింపజేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం జీహెచ్ఎంసీలో అనుమతి పొందిన ప్లాన్‌కు మించి అదనంగా నిర్మాణాలు చేపట్టడం... ఆమోదం పొందకుండానే నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో 2007 డిసెంబర్ 31న జారీ కాగా... పలుమార్లు పొడిగించారు. అలా 2010 వరకు అవకాశం కల్పించారు. దీనికోసం జీహెచ్ఎంసీకి 2.05 లక్షల దరఖాస్తులు రాగా.... ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన 55,901 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,44,353 దరఖాస్తులు బీపీఎస్ నిబంధనల మేరకు ఉండడంతో భవనాలు క్రమబద్ధీకరించారు. మిగతా దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలు లేకపోవడం, ఫీజులు చెల్లించకపోవడం, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉంచారు. బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి అప్పట్లో దాదాపు రూ.868 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించుకున్న వారికీ అవకాశం కల్పించడంతో పాటు ఇదే చివరి గడువని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల అప్పట్లో తిరస్కరణకు గురైన వారు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కలగనుంది. గతంలో అవకాశాన్ని వినియోగించుకోని వారితో పాటు ఆ తర్వాత కొత్తగా వచ్చిన అక్రమ నిర్మాణాలు కలిపి దాదాపు లక్షన్నర వరకు ఉండవచ్చుననే ది అంచనా. వీటితో పాటు ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలు కలిపితే సుమారు రెండు లక్షల దాకా ఉంటాయని భావిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనివి కావడంతో గతంలో వచ్చినంత కాకపోయినా రూ. 200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని టౌన్ ప్లానింగ్ నిపుణుల అంచనా. స్వాధీనమే పరిష్కారమని... భవిష్యత్‌లో తిరిగి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీక రణకు ఇదే చివరి అవకాశంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే... నిబంధనలు ఉల్లంఘించినంత మేరకు భవనంలోని భాగాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోనుంది. అలా స్వాధీనం చేసుకున్న వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడమో లేక వేలం ద్వారా విక్రయించడమో చేయాలనే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి అవసరమైన చట్ట సవరణ, నిబంధనలపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు అక్రమంగా వెలసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుండటం తెలిసిందే. తద్వారా ఎంతో సంపద నష్టం కావడమే కాక... కొంతకాలానికి తిరిగి వెలుస్తున్నాయి. కొత్తగా అమల్లోకి తేనున్న ‘స్వాధీనం’ యోచనతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఒకఅంతస్తుకు అనుమతి పొంది.. రెండు, మూడంతస్తులు.... నాలుగంతస్తుల వరకు అనుమతి ఉంటే అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి అదనపు అంతస్తులను స్వాధీనం చేసుకోవడం వల్ల అక్రమాలు పునరావృతం కావని భావిస్తున్నారు. దీనివల్ల జీహెచ్ఎంసీకి వచ్చే రాబడి కంటే ప్రజలు అక్రమాల జోలికే వెళ్లకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. బీపీఎస్.. దరఖాస్తులు.. పరిష్కారం 2007 డిసెంబర్ 31న బీపీఎస్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెలువరించింది. 2007 డిసెంబర్ 15 కన్నా ముందు నిర్మించిన అక్రమ భవనాలకే ఇది వర్తిస్తుంది. బీపీఎస్ కోసం జీహెచ్ఎంసీకి అందిన మొత్తం దరఖాస్తులు: 2,05,006 పరిష్కారమైనవి: 1,44,353 తిరస్కరించినవి: 55,901 బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి వచ్చిన ఆదాయం: రూ.868.87 కోట్లు బీపీఎస్‌కు ముగింపు పలికింది: 31 మే 2013 -
పుర ఖజానాలకు సర్కారు నజరానా..
బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణ త్వరలో విడుదల కానున్న ఉత్తర్వులు మున్సిపాలిటీలకు పెరగనున్న రాబడి మండపేట : పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. గతంలో మాదిరి అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ (బీపీఎస్, ఎల్ఆర్ఎస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)ను ఆదేశించినట్టు సమాచారం. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణకు త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, అనధికార లే అవుట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, పరిసరాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది. అనధికార లే అవుట్లలో ఇల్లు నిర్మించుకున్న వారు మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో పక్క అనధికార నిర్మాణాలు చేసిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయా వర్గాల వారికి ఊరట కల్పించడంతో పాటు, పురపాలక సంస్థలకు ఆదాయం సమకూర్చే దిశగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ల ద్వారా భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చారు. తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం పలు దఫాలుగా దీనిని 2013 మే వరకు కొనసాగించి తర్వాత నిలిపివేసింది. వీటి ద్వారా జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు భారీగా ఆదాయం సమకూరగా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి తదితర మౌలిక వసతుల కల్పనకు వినియోగించే వీలు కలిగింది. ప్రస్తుతం అదే తరహాలో అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏను సీఎం ఆదేశించినట్టు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో బీసీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చంటున్నాయి. కాగా గతంలో కోర్టు కేసుల్లో ఉన్న వాటిని మిన హాయించగా తాజా ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నారు.