క్రమబద్ధీకరణ.. ఏదీ ఆదరణ
-
బీపీఎస్‌కు 4,200 దరఖాస్తులు
-
ఇప్పటివరకు 82 భవనాలకు మాత్రమే అనుమతి
-
సెప్టెంబర్ 30 వరకే గడువు
అక్రమ, అనధికారిక నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) నత్తనడకన సాగుతోంది. దీని ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని కార్పొరేషన్ అధికారులు భావించారు. అయితే వివిధ కారణాలరీత్యా దరఖాస్తులు ఎక్కువగా రాలేదు.
నెల్లూరు సిటీ : నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో అక్రమ, అనధికారిక కట్టడాలు సుమారు 15వేలకు పైగానే ఉన్నాయి. గతేడాది మే 27వ తేదీన బీపీఎస్ స్కీం అందుబాటులోకి వచ్చింది. కార్పొరేషన్ పరిధిలో సుమారు 10వేలకు పైగానే దరఖాస్తులు వస్తాయని, దీనిద్వారా కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు ఆదాయం సమకూరుతుందని టౌన్‌ప్లానింగ్ అధికారులు అంచనావేశారు. అయితే ఈ పథకం ఆశించినస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు.
తలకిందులైన అంచనాలు..
బీపీఎస్ స్కీం విషయంలో మేయర్ అజీజ్, కార్పొరేషన్ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అధికసంఖ్యలో దరఖాస్తులు, ఆదాయం వస్తుందని అప్పట్లో మేయర్ ప్రకటన చేశారు. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రాజకీయ బదిలీ కావడంతో స్కీం అమలులో వేగం తగ్గింది. అధికారులు సైతం ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లకపోవడంతో కేవంల 4,200 దరఖాస్తులే వచ్చాయి. పథకం ప్రారంభమైన తర్వాత హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. అయితే దీంతో ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆతర్వాత ప్రచార విషయం పట్టించుకోలేదు.
క్రమబద్ధీకరణలో జాప్యం..
దరఖాస్తులు చేసుకున్న వారి ఫైల్స్‌ను మంజూరుచేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో బీపీఎస్‌లో ఫీజు చెల్లించిన వారికి ఎదురుచూపులు తప్పలేదు. తాము డబ్బులు చెల్లించినా క్రమబద్ధీరణ చేయకుండా తిప్పికుంటున్నారని భవన యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు ఇటీవల టౌన్‌ప్లానింగ్ విభాగంలోని టీపీఎస్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను మంత్రి నారాయణ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో అధికారులను నియమించినప్పటికీ, కొందరు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. దీంతో బీపీఎస్ స్కీం కింద దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు లేకుండాపోయారు. కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు పరిశీలన ముందుకుసాగడం లేదు.
మరికొద్దిరోజులే గడువు
క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువు తక్కువగా ఉంది. ఇప్పటికి 82 దరఖాస్తులను మంజూరుచేశారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే క్రమబద్ధీకరణకు అవకాశం ఉండటంతో తమ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా అని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు.