ఎంతెంత దూరం...
- లక్ష్యం చేరని బీపీఎస్
- అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ అంతంతమాత్రమే
- అవకాశమిచ్చినా ఉత్సాహం చూపని జనం
ధర్మవరం : మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ(బీపీఎస్) కార్యక్రమం లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. అక్రమంగా భవనాలను నిర్మించుకున్న వారు బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్) స్కీం కింద దరఖాస్తు చే సి కూడా రెగ్యులరైజ్ చేసుకోకుండా మిన్నకుండి పోయారు. దీంతో మున్సిపాలిటీల ఆదాయానికి భారీగానే గండి పడుతోంది. బీపీఎస్‌కు ధరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 55 శాతం మంది మాత్రమే మున్సిపాలిటీకి అపరాధ రుసుము చెల్లించి తమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. బీపీఎస్ విషయంలో మున్సిపల్ అధికారులు భవన యజమానుల పట్ల సుతిమెత్తగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత వల్ల బీపీఎస్‌ను పట్టించుకునే వారు లేకపోవడం , ఉన్న కొద్ది మంది అధికారులు పని ఒత్తిడి కారణంతో మున్సిపాలిటీలకు భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చే ఈ ప«థకంపై సరిగా మానిటరింగ్ చేయలేకపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
రూ.10 వేలు చెల్లించినా...
మున్సిపాలిటీలలో నిర్మించిన అనధికార భవనాలు, ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించుకునేలా 2015 మే నుంచి 2016 ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ద్వారా బీపీఎస్ దరఖాస్తులను స్వీకరించారు. అనుమతులు లేకుండా నిర్మించుకున్న భవన యజమానులు మొదట రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలోలో 1068, మిగిలిన 11 మున్సిపాలిటీల పరిధిలో 1029 మంది ఈ బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాటన్నింటినీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన మొత్తం 2097 దరఖాస్తుల్లో ఇప్పటి దాకా కేవలం 1173 దరఖాస్తులు ఆమోదం పొందగా 19 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 905 ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 70 మంది బీపీఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకోగా. 39 మంది మాత్రమే అపరాధ రుసుం చెల్లించి రెగ్యులర్ చేసుకోగా, మిగిలిన 31 మంది ఇంకా రెగ్యులర్ చేసుకోలేదు. సిబ్బంది కొరతతో కొంత జాప్యం జరుగుతుండగా... ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుములకు భయపడి ఈ స్కీంకు దరఖాస్తు చేసుకున్నా..రెగ్యులర్ చేసుకోవడానికి మురికొందరు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.
31 వరకు గడువు : బీపీఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 31వ తేది వరకు తమ భవనాలను రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించారు.
బీపీఎస్‌కు వచ్చిన దరఖాస్తులు ఇలా..
మున్సిపాలిటీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవి రెగ్యులర్ చేసినవి తిరస్కరించినవి
అనంతపురం (కార్పొరేషన్) 1068 459 608 1
ధర్మవరం 70 31 39 0
గుత్తి 25 14 10 0
హిందూపురం 165 42 123 0
కదిరి 31 15 16 0
గుంతకల్లు 290 76 213 1
కళ్యాణదుర్గం 24 10 14 0
మడకశిర 14 4 8 2
పుట్టపర్తి 36 31 5 0
పామిడి 10 1 8 1
రాయదుర్గం 45 22 9 14
తాడిపత్రి 319 200 119 0