
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): క్షణికావేశం.. ఆ తల్లిని హంతకురాలిని చేసింది. నవమాసాలూ మోసి కన్న బిడ్డనే కర్కశంగా హత్య చేసేలా ప్రేరేపించింది. అంతేకాదు, తను రక్తం పంచిన ఆ బిడ్డ శరీరం రక్తమోడుతున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. మరణించే దాకా అలానే ఉండిపోయింది.. ఆ తర్వాత తనూ ఆత్మహత్యా యత్నం చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్న బీరే శ్రీనివాసులు, భార్య మీనాక్షిలు చేనేత కార్మికులు. వీరికి తనుశ్రీ, ప్రణతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు గొట్లూరు గ్రామానికి వెళుతుంటాడు. మీనాక్షి ఇంట్లోనే మగ్గం నేస్తుంటుంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు.
అయితే ఏమైందో ఏమోగానీ శుక్రవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె తనుశ్రీ అమ్మమ్మ ఇంటికెళ్లింది. భర్త వెళ్లిన కాసేపటికే మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి.. రెండున్నరేళ్ల చిన్న కుమార్తె ప్రణతి ఎడమ చేతిని మగ్గం పోగులు కోసే కత్తితో కోసేసింది. నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తున్నా తల్లి మనసు కరగలేదు. ప్రాణాలు పోయే వరకూ అలాగే ఉండిపోయింది. తర్వాత తనూ చేయి కోసుకుంది. ఎంతకీ తన ప్రాణాలు పోకపోవడంతో చీరతో ఉరేసుకుంది. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో వారు తలుపుల్ని బద్దలు కొట్టారు. మీనాక్షిని వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, అర్బన్ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment