బీపీఎస్...కథ అడ్డం తిరిగింది!
- సర్కారు ప్రకటనతో పెరిగిన అక్రమాలు
- విచ్చలవిడిగా నిర్మాణాలు
- ప్రకటన వెలువడి .. జీవో రాకపోవడంతో పెచ్చుమీరుతున్న డీవియేషన్లు
- అందినకాడికి దండుకుంటున్న అధికారులు
బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)... ఇది అక్రమాలను నిరోధించే పథకం. కానీ.. ఇదే ఇప్పుడు అక్రమార్కులకు రక్షణగా మారుతోంది. ఎలాగూ బీపీఎస్ కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తారనే ధీమాతో అడ్డగోలు నిర్మాణాలకు తెరలేపారు. ఒకప్పుడు భయంతో వణికిన వారు సైతం యథేచ్ఛగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. అతిక్రమణలకు పాల్పడుతున్నారు. సర్కారు ఒకటి తలిస్తే... వాస్తవానికి జరుగుతోంది మరోలా ఉంది. అక్రమార్కులకు అధికార యంత్రాంగం సైతం సహకరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
సాక్షి సిటీబ్యూరో: అనుకున్నదొకటి.. అయ్యింది ఒకటి ..అన్న చందంగా మారింది త్వరలో అమల్లోకి రానుందని భావిస్తున్న బీపీఎస్ వ్యవహారం. ఒకసారి బీపీఎస్‌కు అనుమతివ్వడం ద్వారా తిరిగి అక్రమ నిర్మాణాలకు తావివ్వరాదనే తలంపులో ఉన్న ప్రభుత్వం ఆమేరకు ప్రకటన చేసింది. విశ్వనగరంగా ఎదిగే క్రమంలో అడ్డదిడ్డంగా..అక్రమ నిర్మాణాలు ఉండరాదని పకడ్బందీ ప్రణాళికతో నగర నిర్మాణం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీపీఎస్‌కు ఒకపర్యాయం అవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రకటన వెలువడ్డాక దాదాపు మూడునెలలుగా ఆ విషయంపై ఎందుకనో నిర్ణయం తీసుకోలేదు. వెంటనే జీవో వెలువరించి.. మార్గదర్శకాలు జారీ చేస్తే ఈపాటికే క్రమబద్ధీకరణ ప్రారంభమయ్యేది.
కానీ అలా జరగకపోవడంతో తిరిగి ఎలాగూ బీపీఎస్ వస్తుంది కనుక, ఇదే మంచి అదను అనుకొని కొందరు అడ్డదిడ్డంగా అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. రెండంతస్తులకు అనుమతులున్న వారు అదనపు అంతస్తులు నిర్మిస్తుండగా, అసలు అనుమతుల్లేకుండానే వెలుస్తున్న భవనాలకూ అంతూపొంతూ లేకుండా పోతోంది. ఇలా ఒక సర్కిల్ పరిధిలో అని కాకుండా నగరమంతా ఇదే తంతు నడుస్తోంది. అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇదే మంచి తరుణమని, మరోసారి అవకాశం రాదంటూ వారే నిర్మాణదారులకు సలహాలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకుగాను అనుమతుల్లేని నిర్మాణాలకు దాదాపు రూ. 2 నుంచి రూ. 4 లక్షలు , అదనపు అంతస్తులకు ఒక్కోదానికి రూ.లక్ష వంతున టౌన్‌ప్లానింగ్ సిబ్బింది వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తల్లకిందులైన ఆలోచన..
ఎలాగూ బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లు అమల్లోకి వస్తాయని తెలిసి జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూపాయి రాకలో వీటి ద్వారా రూ. 800 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. అవి గత మార్చికి ముందున్న అంచనాలు. దాదాపు గడచిన రెండున్నర నెలల కాలంలోనే అక్రమనిర్మాణాలు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. ఒక్క కూకట్‌పల్లి సర్కిల్‌లోనే దాదాపు వెయ్యి అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అంచనా. దీంతో క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి బీపీఎస్‌ను అమల్లోకి తేవడం వెనుక ఉద్దేశం ఉన్న అక్రమనిర్మాణాలను క్రమబద్ధీకరించి.. ఇకపై ఒక్క అక్రమనిర్మాణం కూడా రాకుండా చేయాలని.
కానీ..ప్రకటన వెలువడిన నాటినుంచీ ఈ అక్రమాలు పెచ్చుమీరి పోయాయి. అక్రమనిర్మాణాలను అడ్డుకోవాల్సిందిగా జీహెచ్‌ంఎసీ ప్రధాన కార్యాలయం నుంచి సర్కిళ్ల అధికారులకు ఆదేశాందుతున్నా లెక్క చేస్తున్నవారు లేరు. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే నియంత్రిస్తామని, కూల్చివేతలు అంతిమచర్యలని గత సంవత్సరం గురుకుల్‌ట్రస్ట్‌లో కూల్చివేతల సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్రమాలను ప్రోత్సహించిన అధికారులనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అక్రమ నిర్మాణాలు ఆగడం లేవు. బీపీఎస్ ప్రకటనతో మరింత విచ్చలవిడిగా సాగుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో అధికం....
గచ్చిబౌలి/కూకట్‌పల్లి : జీహెచ్‌ఎంసీ ఆదాయంలో సింహభాగం శేరిలింగంపల్లి పరిధిలోని రెండు సర్కిళ్లదే. అక్కడి అధికారుల అవినీతి కూడా అదే రీతిలో ఉంటుంది. బీపీఎస్ అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ జంట సర్కిళ్లలో అక్రమ నిర్మాణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని సర్కిళ్లలో పనిచేసే టౌన్ ప్లానింగ్ అధికారులు స్లాబ్‌కు లక్ష చొప్పున దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జంట సర్కిళ్లలో 140 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అంచనా. శేరిలింగంపల్లి సర్కిల్-11లో 60కి పైగా, సర్కిల్-12లో 80కి పైగా అక్రమ నిర్మాణాలు వెలసినట్లు తెలుస్తోంది. సర్కిల్-11 పరిధిలో గచ్చిబౌలి, అంజయ్యనగర్, శ్రీరాంనగర్, మసీద్‌బండ, రాఫవేంద్రనగర్, రాజరాజేశ్వరీ కాలనీ, సిద్ధిఖీనగర్, సర్కిల్-12 పరిధిలోని చందానగర్, గోకుల్‌ప్లాట్స్, మక్తా మహబూబ్‌పేట్, బీకే ఎన్‌క్లేవ్, రెడ్డి ఎన్‌క్లేవ్, ప్రశాంత్‌నగర్‌లలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.
కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ డివిజన్లతో పాటు మూసాపేటలో అక్రమ నిర్మాణాలకు అడ్డులేకుండా పోయింది. గతంలో సర్కిల్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు భారీ ప్రణాళికలు చేపట్టిన అధికారులు అనంతరం ఎందుకనో వెనక్కు తగ్గారు. సర్కిల్ పరిధిలో అడ్డగుట్ట సొసైటీ, సర్ధార్‌పటేల్‌నగర్, ఆంజనేయనగర్, మోతీనగర్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోనూ దాదాపు 300కు పైగా అక్రమనిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నిసర్కిళ్లలోనూ ఇదే తంతు సాగుతుండగా, శివారు ప్రాంతాల్లో అధికంగా ఉంది.