క్రమబద్ధీకరణకు కటాఫ్ అక్టోబర్ 26
* ఆలోపు ఏర్పాటైన భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* ఎల్‌ఆర్‌ఎస్ ముసాయిదా సిద్ధం.. నేడు ఉత్తర్వుల జారీ!
* పునర్విభజన చట్టం నిబంధనల ఆధారంగా మున్సిపల్ చట్టాల సవరణ
* ఆ తర్వాత ‘బీపీఎస్’పై ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీని కటాఫ్‌గా ప్రభుత్వం ఖరారు చేసింది.
భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్), లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) పథకాలను ప్రవేశపెటేందుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 26న సంబంధిత ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదేరోజును కటాఫ్ తేదీగా తీసుకుని క్రమబద్ధీకరణ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 2015 అక్టోబర్ 26వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు, లేఅవుట్లనే క్రమబద్ధీకరిస్తారు.
ఈ తేదీలోపు నిర్మితమైన భవనాలన్నింటినీ ‘గూగుల్ మ్యాప్స్’ సహకారంతో గుర్తించి క్రమబద్ధీకరించే అవకాశముంది. రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా పరిగణించాలనే ప్రతిపాదనలున్నప్పటికీ... రాష్ట్రంలో అనుమతి లేని భవనాలు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 26ను కటాఫ్‌గా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరణ కోసం తొలుత రెండు నెలల గడువు ఇచ్చి ఆ తర్వాత పొడిగించే అవకాశముంది. కాగా ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన ముసాయిదా ఉత్తర్వులను సిద్ధం చేసిన పురపాలక శాఖ శుక్రవారం తుది ఉత్తర్వులను జారీ చేసే అవకాశముంది. బీపీఎస్ ఉత్తర్వులకు మాత్రం మరికొన్ని రోజులు పట్టనుంది.
పునర్విభజన చట్టంతో..
అక్రమ భవనాల క్రమబద్ధీకరణపై న్యాయపర అడ్డంకులను తొలగించుకునేలా మున్సిపల్ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేషించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాలను సవరించడం కోసం ఆర్డినెన్స్‌కు బదులుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును ఉపయోగించుకోనుంది. 2014 జూన్ 2కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏ చట్టాన్నయినా తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుని (అడాప్ట్) చేసుకుని తమ అవసరాలకు తగ్గట్లు సవరణ చేసుకోవచ్చని ఈ చట్టం పేర్కొంటోంది.
ఈ నిబంధన ఆధారంగానే ఏపీ మున్సిపల్ చట్టాలను ‘క్రమబద్ధీకరణ’కు అనువుగా సవరించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే బీపీఎస్ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఆ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకం అమలు కానుంది. లేకుంటే వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో ఈ పథకాల్ని అమలు చేసి, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్‌లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది.