Buildingslayout Regulation
-
వెయ్యి కోట్లు వస్తాయా?
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు స్పందన కొరవడింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల అమలుతో భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ఒక్క హైదరాబాద్ మహానగరం పరిధిలోనే ఏకంగా రూ.1,000 కోట్ల రాబడిని రాబట్టుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే, రాష్ట్రం మొత్తం మీద వచ్చే ఆదాయం కూడా రూ.1,000 కోట్ల మార్కును అందుకుంటుందో? లేదో? అని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)ల పరిధిలో ఉన్న అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్లలో ప్రస్తుతం క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు నామమాత్రంగానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో లక్షల సంఖ్యలో అక్రమ భవనాలు, లేఅవుట్లు ఉండగా.. లక్ష దరఖాస్తులు కూడా రాలేదు. వీటి పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 95,551 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణ కోసం 1,01,382 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తొలుత దరఖాస్తుతో పాటు రూ.10 వేల డీడీని సమర్పించాలని, మిగిలిన రుసుమును పరిష్కరించే సమయంలో చెల్లించాలని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ రుసుముల రూపంలో జీహెచ్ఎంసీకి రూ.90 కోట్లు, హెచ్ఎండీఏకి రూ.60 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికల పరిధిలో స్పందన కూడా తీవ్ర నిరాశను కలిగించేలా ఉంది. ఈ 67 పురపాలికల పరిధిలో లే అవుట్ల క్రమబద్ధీకరణకు 33,122 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణకు 31,748 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు రెండింటికీ కలిపి ఈ పురపాలికలకు వచ్చిన దరఖాస్తు రుసుము రూ.30 కోట్లు మాత్రమే. గత నెలాఖరుతోనే క్రమబద్ధీకరణ పథకాలకు దరఖాస్తు గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. గడువు పొడిగించిన తర్వాత కూడా ఆశించిన స్పందన లభించలేదని పురపాలక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టినా.. ఎప్పటిలాగే నగర, పట్టణాల్లోని అక్రమ లేఅవుట్లు, భవనాలను ఆయా పురపాలికల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది చూస్తూ మిన్నకుండిపోతున్నారని.. అందుకే ఆశించినంత స్పందన రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
క్రమబద్ధీకరణకు కటాఫ్ అక్టోబర్ 26
* ఆలోపు ఏర్పాటైన భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం * ఎల్ఆర్ఎస్ ముసాయిదా సిద్ధం.. నేడు ఉత్తర్వుల జారీ! * పునర్విభజన చట్టం నిబంధనల ఆధారంగా మున్సిపల్ చట్టాల సవరణ * ఆ తర్వాత ‘బీపీఎస్’పై ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీని కటాఫ్‌గా ప్రభుత్వం ఖరారు చేసింది. భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్), లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలను ప్రవేశపెటేందుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 26న సంబంధిత ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదేరోజును కటాఫ్ తేదీగా తీసుకుని క్రమబద్ధీకరణ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 2015 అక్టోబర్ 26వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు, లేఅవుట్లనే క్రమబద్ధీకరిస్తారు. ఈ తేదీలోపు నిర్మితమైన భవనాలన్నింటినీ ‘గూగుల్ మ్యాప్స్’ సహకారంతో గుర్తించి క్రమబద్ధీకరించే అవకాశముంది. రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా పరిగణించాలనే ప్రతిపాదనలున్నప్పటికీ... రాష్ట్రంలో అనుమతి లేని భవనాలు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 26ను కటాఫ్‌గా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ కోసం తొలుత రెండు నెలల గడువు ఇచ్చి ఆ తర్వాత పొడిగించే అవకాశముంది. కాగా ఇప్పటికే ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ముసాయిదా ఉత్తర్వులను సిద్ధం చేసిన పురపాలక శాఖ శుక్రవారం తుది ఉత్తర్వులను జారీ చేసే అవకాశముంది. బీపీఎస్ ఉత్తర్వులకు మాత్రం మరికొన్ని రోజులు పట్టనుంది. పునర్విభజన చట్టంతో.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణపై న్యాయపర అడ్డంకులను తొలగించుకునేలా మున్సిపల్ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేషించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాలను సవరించడం కోసం ఆర్డినెన్స్‌కు బదులుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును ఉపయోగించుకోనుంది. 2014 జూన్ 2కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏ చట్టాన్నయినా తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుని (అడాప్ట్) చేసుకుని తమ అవసరాలకు తగ్గట్లు సవరణ చేసుకోవచ్చని ఈ చట్టం పేర్కొంటోంది. ఈ నిబంధన ఆధారంగానే ఏపీ మున్సిపల్ చట్టాలను ‘క్రమబద్ధీకరణ’కు అనువుగా సవరించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే బీపీఎస్ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఆ జిల్లాలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకం అమలు కానుంది. లేకుంటే వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో ఈ పథకాల్ని అమలు చేసి, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్‌లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది.