వెయ్యి కోట్లు వస్తాయా?
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు స్పందన కొరవడింది. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల అమలుతో భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ఒక్క హైదరాబాద్ మహానగరం పరిధిలోనే ఏకంగా రూ.1,000 కోట్ల రాబడిని రాబట్టుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే, రాష్ట్రం మొత్తం మీద వచ్చే ఆదాయం కూడా రూ.1,000 కోట్ల మార్కును అందుకుంటుందో? లేదో? అని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)ల పరిధిలో ఉన్న అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్లలో ప్రస్తుతం క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు నామమాత్రంగానే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో లక్షల సంఖ్యలో అక్రమ భవనాలు, లేఅవుట్లు ఉండగా.. లక్ష దరఖాస్తులు కూడా రాలేదు. వీటి పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 95,551 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణ కోసం 1,01,382 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తొలుత దరఖాస్తుతో పాటు రూ.10 వేల డీడీని సమర్పించాలని, మిగిలిన రుసుమును పరిష్కరించే సమయంలో చెల్లించాలని ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఈ రుసుముల రూపంలో జీహెచ్‌ఎంసీకి రూ.90 కోట్లు, హెచ్‌ఎండీఏకి రూ.60 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికల పరిధిలో స్పందన కూడా తీవ్ర నిరాశను కలిగించేలా ఉంది. ఈ 67 పురపాలికల పరిధిలో లే అవుట్ల క్రమబద్ధీకరణకు 33,122 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణకు 31,748 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ దరఖాస్తులు రెండింటికీ కలిపి ఈ పురపాలికలకు వచ్చిన దరఖాస్తు రుసుము రూ.30 కోట్లు మాత్రమే. గత నెలాఖరుతోనే క్రమబద్ధీకరణ పథకాలకు దరఖాస్తు గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
గడువు పొడిగించిన తర్వాత కూడా ఆశించిన స్పందన లభించలేదని పురపాలక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టినా.. ఎప్పటిలాగే నగర, పట్టణాల్లోని అక్రమ లేఅవుట్లు, భవనాలను ఆయా పురపాలికల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది చూస్తూ మిన్నకుండిపోతున్నారని.. అందుకే ఆశించినంత స్పందన రావడం లేదని విమర్శలు వస్తున్నాయి.