సాక్షి, అమరావతి: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల నిర్మాణం ఉధృతమైంది. కమర్షియల్ ఏరియాల్లో ఈ తాకిడి అధికంగా ఉంది. అనేక పట్టణాలు, నగరాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కుమ్మక్కై బీపీఎస్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనుకుంటే.. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోటీపడి తమ ఆదాయం పెంచుకునే పనిలో మునిగిపోయారు. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి భవన యజమానులను, బిల్డర్లను ప్రోత్సహిస్తూ అక్రమంగా ఫ్లోర్లు, కట్టడాలు నిర్మింపజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోయినా కూడా.. బీపీఎస్ వివరాలు చెప్పి మరీ వారిని అక్రమ నిర్మాణాలకు పురిగొల్పుతున్నారు. 1985 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 31లోపు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడైనా సరే పది, పదిహేను రోజుల్లో ఇష్టమొచ్చినట్లుగా అదనపు ఫ్లోర్లు, ఇతర నిర్మాణాలు పూర్తిచేసుకుంటే.. వాటిని గతేడాది ఆగస్టు 31లోపే నిర్మించినట్టు రికార్డుల్లో చూపిస్తామంటూ భవన యజమానులకు ఎర వేస్తున్నారు. అలా చేసినందుకు తమకు కొంత ముట్టజెప్పాలని డీల్ మాట్లాడేసుకొని.. పని పూర్తి చేస్తున్నారు. అనుకున్న సమయంలోగా నిర్మాణం పూర్తి కావడానికి అవసరమైన సెంట్రింగ్, రెడీమిక్స్ వాహనాలను సైతం వీరే సమకూరుస్తున్నారు. ప్రాంతం, విస్తీర్ణం ఆధారంగా లక్ష నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్లయితే అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను సైతం తమ పేరున రాయించుకుంటున్నారు.
అక్రమార్కులకు చేతులు కలిపిన ప్రభుత్వ సిబ్బంది..
రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, 14 నగరపాలక సంస్థలు, 8 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిల్లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఈనెల 4న మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్నుంచి 90 రోజుల్లోగా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఇలాంటివి రాష్ట్రంలో దాదాపు 20 వేల కట్టడాలున్నట్టు మున్సిపల్ అధికారులు అంచనాకు వచ్చారు. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని మున్సిపల్ శాఖ భావించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్‌మెన్ మొదలు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి.. క్రమబద్ధీకరణ చేసుకునేలా భవన యజమానులను హెచ్చరించాలి. అయితే ఇందుకు భిన్నంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది టీడీపీ నేతలతో చేతులు కలిపి.. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. నిబంధనల ప్రకారం గత ఆగస్టు 31లోపు నిర్మించిన అక్రమ కట్డడాలనే క్రమబద్ధీకరించాల్సి ఉందని.. కానీ ఇప్పుడు నిర్మించినా కూడా వాటిని గత ఆగస్టులోపే కట్టినట్టు రికార్డుల్లో చూపిస్తామని భవన యజమానులకు ఎర వేస్తున్నారు. దీంతో కొందరు బిల్డర్లు, భవన యజమానులు.. టీడీపీ నేతలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పినట్లుగా రాత్రికిరాత్రి అక్రమంగా ఫ్లోర్లకుఫ్లోర్లు నిర్మించి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
విజయవాడలో..
విజయవాడలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన గురునానక్ నగర్ ప్రారంభంలోనే ఒక భవనంపై రాత్రికి రాత్రి అనధికారికంగా ఒక ఫ్లోర్ వేసేశారు. టీడీపీ నేతల ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ నిర్మాణానికి సహకరించారని చెబుతున్నారు. దీని కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముడుపులు చేతులు మారేయనే విమర్శలు వినపడుతున్నాయి. అలాగే భవానీపురం బైపాస్ రోడ్‌ను ఆనుకుని ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు సమీపంలోని ఒక భవనానికి బిల్డర్ జి+3 ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం సెల్లార్‌ను పార్కింగ్‌కు కేటాయించాలి. అయితే సెల్లార్‌ను పార్కింగ్‌కు వదలకుండా దానికి కూడా గోడలు నిర్మించి.. దుకాణాలకు అద్దెకిచ్చేందుకు అనువుగా షట్టర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్థానిక బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్.. తన కార్యాలయంలోని ఉద్యోగులతో పాటు అధికారులకు కూడా వాటాలు పంచినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment