క్రమ బద్ధకం.. | krama baddakam | Sakshi
Sakshi News home page

క్రమ బద్ధకం..

Published Sun, Oct 16 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

క్రమ బద్ధకం..

క్రమ బద్ధకం..

బీపీఎస్‌కు స్పందన నామమాత్రం 
పరిష్కారంలోనూ జాప్యం 
నెలాఖరుతో గడువు పూర్తి   
కొవ్వూరు : పురపాలక సంఘాల్లో అనధికార భవనాల క్రమబద్ధీకరణ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం–బీపీఎస్‌)కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా ఈ పథకం గడువును సర్కారు మరోనెల పొడిగించింది. జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతీ, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి. వీటిల్లో సుమారు 8వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వం భవన క్రమబద్ధీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1985 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్‌ 31లోపు నిర్మించిన అనధికార నిర్మాణాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. దీనికి సెప్టెంబర్‌ 30వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే అక్రమ నిర్మాణదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మరోనెల రోజుల గడువు పెంచుతూ జీవో నంబర్‌ 234 జారీ చేసింది. అక్టోబర్‌ 30తో ఈ గడువు పూర్తికానుంది. అయినా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 4,634 దరఖాస్తులందాయి. వీటిలో 1,313 నిర్మాణాలను మాత్రమే అధికారులు క్రమబద్ధీకరించారు. మరో 3,313 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వివిధ కారణాలతో 541 అర్జీలను పెండింగ్‌లో పెట్టారు. ఏలూరులో ఒకటి, తాడేపల్లిగూడెంలో ఒక దరఖాస్తును తిరస్కరించారు. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.19.17 కోట్లు ఆదాయం సమకూరింది. కేవలం 28.46 శాతం అక్రమ కట్టడాలను మాత్రమే క్రమబద్ధీకరించారు.
జనవరి నుంచి పెరుగుతున్న గడువు
వాస్తవానికి జిల్లాలో క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు జనవరితోనే ముగిసింది. స్పందన సరిగా లేకపోవడంతో ప్రభుత్వం అప్పటి నుంచి గడువు పెంచుతూ వస్తోంది. తొలుత జూలై నెలాఖరుకు గడువు పెంచిన సర్కారు ఆ తర్వాత సెప్టెంబర్‌ 30కి, తాజాగా అక్టోబర్‌ నెలాఖరుకు పెంచింది. ఇప్పుడు మరో 15 రోజులే గడువున్నా, అక్రమ నిర్మాణదారుల నుంచి స్పందన లేదు. జిల్లాలో భీమవరం, తణుకు పురపాలక సంఘాల్లో అనధికారిక నిర్మాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మొత్తం అక్రమ కట్టడాల్లో సగం ఈ రెండు పట్టణాల్లోనే ఉన్నాయని సమాచారం. ఇప్పటికే భీమవరం పురపాలక సంఘానికి బీపీఎస్‌ ద్వారా రూ.6.67 కోట్లు, తణుకు మునిసిపాలిటీకి రూ.2.80 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. 
నరసాపురం ఫస్ట్‌ 
అక్రమ క్రబద్ధీకరణ పథకం అమలులో నరసాపురం మునిసిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. 76.76 శాతం క్రమబద్ధీకరణతో జిల్లాలో మొదటిస్థానం సాధించింది. జంగారెడ్డిగూడెం ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక్కడ అతితక్కువగా 13.75 శాతమే భవనాలను క్రమబద్ధీకరించారు.  కొవ్వూరు, పాలకొల్లు పురపాలక సంఘాల్లోనూ బీపీఎస్‌కు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్లాన్‌ కాపీ, అటెస్టెడ్‌ దస్తావేజులు, యాజమాని ఆధార్‌ నంబర్‌ వంటివి ఆన్‌లైన్‌కి అప్‌లోడ్‌ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి అపరాధ రుసుం సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాల వల్ల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరణ అయితే పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
 
 
.......................................................................................
మునిసిపాలిటీ/        మొత్తం        పరిశీలనలో   పరిష్కారం
కార్పొరేషన్‌       దరఖాస్తులు     ఉన్నవి       అయినవి
..........................................................................................
ఏలూరు            695           432          262
భీమవరం       1,155           822          333
3.జంగారెడ్డిగూడెం 80               69            11
4.కొవ్వూరు          242            208             34
5.నరసాపురం      142              33            109
6.నిడదవోలు       122              76              46  
7.పాలకొల్లు         566            464            102
8.తాడేపల్లిగూడెం  547            414            132
9.తణుకు            1,085         795             290
..........................................................................................
మొత్తం             4,634         3,313           1,319
..........................................................................................
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement