బీపీ‘ఎస్’!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో మళ్లీ బీపీఎస్/బీఆర్‌ఎస్ అమలుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో బీపీఎస్ అమలుపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు దీని అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను రెండు వారాల క్రితం ప్రభుత్వానికి పంపించారు. సీఎం నుంచి ఆదేశాలు అందగానే జీవో వెలువడే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆరోపణలకు... అవకతవకలకు తావులేకుండా అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. బీపీఎస్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించాలని... మాన్యువల్‌గా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదనే నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ఏ దరఖాస్తు ఎప్పుడు అందిందో తెలియడమేకాక... ఫైలు ఎప్పుడు ఎవరి వద్ద ఉందో తెలిసే వీలుంటుందని భావిస్తున్నారు.
పక్కాగా విధి విధానాలు
గతంలో బీపీఎస్ అమలైనప్పుడు పాత తేదీలతో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, డూప్లికేట్ స్టాంపులు వేసి బీపీఎస్ కింద క్రమబద్ధీకరించినట్లు తప్పుడు సర్టిఫికెట్లు అందజేసిన ఘటనలు వెల్లడయ్యాయి. నిర్ణీత గడువు తర్వాత వెలసిన అక్రమ భవనాలను సైతం ఇబ్బడిముబ్బడిగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని భవనాలకు సంబంధించి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అలాంటివి పునరావృతం కాకుండా ఈసారి ముందే విధి విధానాలను రూపొందించి... కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం అమలవుతున్న ఈ-ఆఫీసు వల్ల ఏ ఫైలు ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్‌కు.. ఎప్పుడు వెళ్లిందీ సమయంతో సహా తెలుస్తోంది. భవనాల అనుమతుల దరఖాస్తుల వంటివి నేరుగా తీసుకొని స్కాన్ చేసి ఈ-ఆఫీస్‌లో ఉంచుతున్నారు. బీపీఎస్ దరఖాస్తులను మాత్రం ఆన్‌లైన్‌లో స్వీకరించడాన్ని తప్పనిసరి నిబంధనగా చేయనున్నట్లు తెలిసింది.
పార్కింగ్‌పై కఠిన వైఖరి
విశ్వ నగరానికి బాటలు వేస్తున్న తరుణంలో విశాలమైన రహదారులు.. పచ్చని మైదానాలే కాక భవనాలు, వీధులు క్రమపద్ధతిలో ఉండాలి. ఇరుకు స్థలంలో వెలసిన భారీ భవనాలను క్రమబద్ధీకరిస్తే వికృతంగా కనిపిస్తాయి. క్రమబద్ధీకరించని పక్షంలో బీఆర్‌ఎస్‌ను తమకు వర్తింపజేయలేదంటూ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు వేసిన వారు గగ్గోలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నగరంలో ఇలాంటివే అధికం. ఈ నేపథ్యంలో ఏమేరకు అక్రమ నిర్మాణాలను అనుమతించాలనే అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో పార్కింగ్ సమస్య తీవ్రత దృష్ట్యా కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచా రం. ప్రస్తుతం జంక్షన్ల వద్ద కొత్త భవనాలకు అనుమతులివ్వడం లేదు. రహదారుల విస్తరణ, మల్టీ ఫ్లై ఓవర్లు రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రూ. 1000 కోట్ల ఆదాయం
బీపీఎస్‌తో ఈ ఆర్థిక సంవత్సరం రూ.500 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌తో రూ.300 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన అధికారులు జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లోనూ దీనిని చూపించారు. దాదాపు వెయ్యి కోట్ల వరకు రాగలదని అంచనా. బీపీఎస్ దరఖాస్తులు 60 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చునని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, మల్టీలెవెల్ గ్రేడ్‌సెపరేటర్లకు బీపీఎస్ ఆదాయం ఉపయోగపడుతుందనేది మరో ఆలోచన.
మళ్లీ దరఖాస్తు చేయాలి
గతంలో గడువులోగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించని కారణంగా కొంతమంది క్రమబద్ధీకరించుకోలేకపోయారు. కొత్తగా బీపీఎస్‌ను అమల్లోకి తెస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. వారు ఇప్పటికే చెల్లించిన ఫీజులను కొత్త దరఖాస్తులకు బదిలీ చేసే వీలుందని పేర్కొన్నారు.
2007లో బీపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయం
బీపీఎస్‌కు వచ్చిన దరఖాస్తులు : 2,05,006
పరిష్కారమైనవి : 1,44,353
జీహెచ్‌ఎంసీ ఆదాయం : రూ. 868.87 కోట్లు