సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు కోసం అమరావతిలో ప్రభుత్వం గుర్తించిన భవనాలను పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఉద్యోగుల విభజనకు ఓ సబ్ కమిటీ, రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ పరిశీలనకు ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు తాము గుర్తించిన భవనాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు గత డిసెంబర్ 27న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజనకుపై న్యాయమూర్తులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏసీజే బుధవారం తన అధ్యక్షతన ఫుల్ కోర్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులందరూ పాల్గొన్న ఈ భేటీ దాదాపు గంటా 10 నిమిషాలు జరిగింది. సమావేశం ఒకింత వాడివేడిగా కొనసాగినట్లు సమాచారం.
హైకోర్టు తరలింపుపై కొందరు న్యాయమూర్తులు కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తినట్లు తెలిసింది. హైకోర్టు విభజనపై 2015 మే 1న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు వల్ల ఎదురయ్యే సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. అంతేగాక న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఉద్యోగుల భత్యాల పెంపు తదితరాలపైనా న్యాయమూర్తులు చర్చించారు. ఈ రెండింటిపై తమ వైఖరిని ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పాలని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. మొత్తమ్మీద హైకోర్టు విభజనపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీజే ఓటింగ్ నిర్వహించారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం గుర్తించిన భవనాల పరిశీలనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గు చూపారు. హైకోర్టు విభజన ప్రక్రియ నిర్ణయాల్లో న్యాయవాదులను కూడా భాగస్వాములు చేయాలన్న అంశమూ చర్చకు వచ్చింది. వారిని ఈ దశలో భాగస్వాములను చేస్తే సమస్యలు పెరుగుతాయని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడటంతో ప్రతిపాదన పక్కకు వెళ్లింది. సబ్ కమిటీ భవనాలను పరిశీలించి వచ్చాక మరోసారి సమావేశమవాలని ఫుల్‌కోర్ట్ నిర్ణయించింది.
తాత్కాలిక భవనాల్లో హైకోర్టు నిర్వహణకు అవసరమైన సదుపాయాలన్నింటి విషయంలో ఎక్కడా రాజీ పడరాదని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయమై తమకు ఏమేం కావాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఉద్యోగుల విభజనకు వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సబ్ కమిటీలో ఐదుమంది ఉండాలని నిర్ణయం జరిగింది. వీటి ఏర్పాటు అధికారాన్ని ఏసీజేకు కట్టబెట్టారు. ముందు భవనాల పరిశీలన కమిటీ, ఆ తర్వాత మిగతావి ఏర్పాటవుతాయి. మరోవైపు, 2015 నాటి జస్టిస్ సేన్‌గుప్తా ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ న్యాయవాదులు బుధవారం ఏసీజేను కోరారు. దాదాపు 300 మంది సంతకాలతో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు విభజనలో తమనూ భాగస్వాములను చేయాలని కోరారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కూడా ఏసీజేకి ఇదే విధంగా వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment