న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు
నరసింహారావుకు నోటీసు జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావుపై ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాఖ్యలు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయ పడిన హైకోర్టు, నరసింహారావుకు కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14(1) కింద నోటీసు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో వారం లోపు వివరించాలని అతన్ని ఆదేశించింది.
అంతేకాక నరసింహారావును తక్షణమే అదుపులోకి తీసుకోవాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ భోజన విరామ సమయంలో నరసింహారావును అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం రూ.25 వేలకు రెండు పూచీ కత్తులు సమర్పించడంతో ఆయన్ను బెయిల్‌పై విడుదల చేశారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవాలి...
ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా అధిక రేట్లకు థియేటర్లు టికెట్లు విక్రయిస్తున్నాయని, దీనివల్ల ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం పడుతోందని, అందువల్ల సదరు థియేటర్ల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. టికెట్ ధర విషయంలో వాస్తవాలను అధికారులు కోర్టు ముందుంచలేదని, దీంతో హైకోర్టు పలు ఉత్తర్వులిచ్చిందని, అవి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని నరసింహారావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్ దాఖలు చేసుకోవడమో లేక రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడమో చేయాలే తప్ప, ఆ ఉత్తర్వులను తాము స్వతంత్రంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణంతో నరసింహారావు పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది.
న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది...
అనంతరం నరసింహారావు స్పందిస్తూ, న్యాయ స్థానాలు వెలువరించే ఇటువంటి ఉత్తర్వుల వల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతు న్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ, అతనికి కోర్టు ధిక్కారం కింద నోటీసు జారీ చేసింది.