మధ్యంతర ఉత్తర్వులను సవరించండి
ధర్మాసనాన్ని కోరిన ఏజీ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూములమ్మిన వారికిగాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 చట్ట నిబంధనల ప్రకారం జీవో 38 జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు జీవో 123 వర్తింపచేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇందుకు సంబం«ధించి తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరపాలని విన్నవించింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 38 జారీ నేపథ్యంలో జనవరి 5న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. ఉభయ పక్షాల న్యాయవాదుల సమ్మతితో జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఈ వ్యాజ్యాలన్నీ విచారణకు వచ్చాయి.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తమ అనుబంధ పిటిషన్‌ను ప్రస్తావించారు. జీవో 38 జారీ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. తుది విచారణ వల్ల జాప్యం జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ అనుబంధ పిటిషన్‌పై వాదనలు వినాలన్నారు. ఈ సమయంలో అటు పిటిషనర్లు, ఇటు ఏజీ మధ్య కొద్దిసేపు తీవ్ర వాదనలు జరిగాయి. అనుబంధ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనమే విచారిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది.
మీ ఆదేశాల మేరకే జీవో 38 తెచ్చాం
Published Wed, Mar 1 2017 2:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement