అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు | Land Acquisition Amendment Act : High Court | Sakshi
Sakshi News home page

అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు

Aug 18 2017 1:24 AM | Updated on Aug 31 2018 8:34 PM

అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు - Sakshi

అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు

భూ సేకరణ సవరణ చట్టం (2017) ప్రకారం రాష్ట్ర సర్కార్‌కు భూ సేకరణ జరిపే అధికారం ఉందని ఉమ్మడి హైకోర్టు చెప్పింది. అయితే భూ సేకరణపై రైతుల అభ్యంతరాల్ని త్వరితగతిన పరిష్కరించాలని.

సాక్షి, హైదరాబాద్‌: భూ సేకరణ సవరణ చట్టం (2017) ప్రకారం రాష్ట్ర సర్కార్‌కు భూ సేకరణ జరిపే అధికారం ఉందని ఉమ్మడి హైకోర్టు చెప్పింది. అయితే భూ సేకరణపై రైతుల అభ్యంతరాల్ని త్వరితగతిన పరిష్కరించాలని.. వారి సమ్మతి, అందుకు అనుగుణంగా జరిగే ఒప్పందాలన్నీ సవరణ చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొంది. అలాగే రాష్ట్ర సర్కార్‌ తీసుకొచ్చిన చట్ట సవరణలతో సంతృప్తి చెందనివారు వ్యాజ్యం దాఖలు చేసుకునే అధికారం వివరించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.

తమ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండగానే ఇతర రైతులతో భూ సేకరణ చేపట్టారంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యాజ్యం విచారణ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్‌ కోసం బైలాంపూర్, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా, మామిడ్యాల రైతుల అభ్యంతరాల్ని కొలిక్కి తేకుండానే ఇతర రైతులతో సిద్దిపేట కలెక్టర్‌ ఒప్పందాలు చేసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం అభ్యంతరాల్ని పరిష్కరించకుండా సెక్షన్‌ 19 ప్రకారం ఒప్పందాలు చేయరాదన్నారు. అయితే 2013  భూ సేకరణ చట్టానికి సవరణలో సెక్షన్‌ 30–ఎ చేర్చారని, దీని వల్ల భూ సేకరణ అవార్డు విచారణ దశలోనూ రైతుల అంగీకారంతో భూమిని ప్రభుత్వం సేకరించవచ్చన్న రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ భూ సేకరణపై రైతుల వినతులు, అభ్యంతరాల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement