
సాక్షి, హైదరాబాద్: చదవలేను మొర్రో.. అని పిల్లాడు మొత్తుకుంటుంటే.. ఒకటో తరగతి కాదు రెండో తరగతి చదవాల్సిందేనన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రెండో తరగతి పాఠాల్ని తన మనవడు అద్వేత్య చదవలేకపోతున్నాడని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న తన వినతిని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బాలుడి నాయనమ్మ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
సోమవారం ఈ రిట్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. స్కూల్ యాజమాన్యం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ధర్మాసనం ముందుకు చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. బాలుడి నాయనమ్మ కోరిక మేరకే అద్వేత్యను రెండో తరగతిలో చేర్చామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో సింగిల్ జడ్జి ఆమె వ్యాజ్యాన్ని కొట్టివేశారు. దాంతో ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.