ఏం చర్యలు తీసుకున్నారు?
హైకోర్టు విభజనపై కౌంటర్ దాఖలు చేయండి
కేంద్రం, ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళ వారం క్యాబినెట్ కార్యదర్శి, కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2015లో తీర్పునిచ్చినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అలాగే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశా లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది జె.నారాయణస్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నారాయణ స్వామి వాదనలు వినిపిస్తూ 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ తీర్పు అమలు కాలేదన్నారు.