సాక్షి, హైదరాబాద్: తన భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో దర్యాప్తును స్థానిక పోలీసులు నిష్పక్షపాతంగా జరిపే అవకాశం లేదని, అందువల్ల దర్యాప్తు బాధ్యతలను సీబీఐ లేదా సిట్‌కు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ నల్లగొండ మునిసిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీని ఆదేశించారు. విచారణను మూడువారాలకు వాయిదా వేశారు.
అంతకు ముందు ఈ వ్యాజ్యంలో పిటిషనర్ లక్ష్మి తరఫున న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ భర్త, మృతుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు పలుమార్లు లక్ష్మితో పాటు శ్రీనివాస్‌ను కూడా ఒత్తిడి చేశారన్నారు. నిరాకరించడంతో శ్రీనివాస్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఒత్తిడి తెచ్చినా లొంగలేదని, దీంతో అప్పటినుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని, జిల్లా ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరామని, కానీ పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదని వివరించారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఎమ్మెల్యే వీరేశం బెదిరించారన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులందరూ కూడా ఎమ్మెల్యే వీరేశంకు అనుచరులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల కాల్‌డేటా ఇవ్వాలని పోలీసులను కోరినా వారు స్పందించడం లేదన్నారు. జిల్లా ఎస్పీ సైతం కేసును పక్కదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారని వివరించారు.
న్యాయమూర్తి విస్మయం
ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చి వారి చేత మాట్లాడించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిందితులెవరో, పోలీసులెవరో తెలియలేదని వ్యాఖ్యానించారు. తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు. కాల్‌డేటాను సేకరించిన మాట వాస్తవమేనని, ఈ దశలో దానిని బయటపెడితే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే సాగుతుందన్నారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు కావాలన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
నా భర్త హత్య కేసును సీబీఐకి అప్పగించండి
Published Thu, Feb 1 2018 2:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment