సాక్షిప్రతినిధి, నల్లగొండ : మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా కోమటిరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. దీనిపై ఆయన రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు. కోర్టు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోగా టీఆర్‌ఎస్ వర్గాలు డీలా పడ్డాయి.
ఉప ఎన్నిక ఆశలపై నీళ్లు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయడం, ఆ తర్వాత వెంటనే శాసన సభ సచివాలయం నల్లగొండ స్థానం ఖాళీగా ఉందని గుర్తించి ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు నివేదించడంతో ఉపఎన్నిక ఖాయమని భావించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా నల్లగొండ జిల్లాపై పట్టు పెంచుకోవాలని టీఆర్‌ఎస్ భావించింది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో ఆరు నెలల కిందట చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన అనుచరులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం మానసికంగా ఉప ఎన్నికకు సిద్ధమయ్యారు. ఇక, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అన్న భావనకు వచ్చారు.
ఈ మేరకు ఆ పార్టీ అధినేత కూడా పార్టీ జిల్లా నాయకులతో మాట్లాడారని, ఎన్నిలకు సిద్ధంగా ఉండాలని సూచించారని ప్రచారం జరిగింది. ఉప ఎన్నిక ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపొచ్చని, సార్వత్రిక ఎన్నికల దాకా ఆ ఊపును కొనసాగించవచ్చని టీఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. కానీ, హైకోర్టు కోమటిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఉప ఎన్నిక ఊసులేకపోవడంతో టీఆర్‌ఎస్ నాయకుల ఉత్సాహంపై నీళ్లు చల్లి నట్లు అయ్యింది. ఉప ఎన్నిక జరిగితే అంతో ఇంతో లబ్ధిపొందచ్చని ఆశించిన ద్వితీయ శ్రేణి, ముఖ్య కార్యకర్తలూ ఉసూరుమన్నారు.
కాంగ్రెస్‌లో పెరిగిన ఆత్మస్థైర్యం
మరోవైపు ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ఆత్మస్థైర్యం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డికి అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మూడు రోజుల కిందట జిల్లా కేంద్రానికి వచ్చిన వెంకట్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటరెడ్డి సభ్యత్వం రద్దు నిర్ణయం నుంచి హైకోర్టు తీర్పు వరకు జరిగిన పరిణామాలన్నీ తమకు లాభించాయన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది. కాంగ్రెస్ దూకుడు పెంచినట్లు కనిపిస్తుండడంతో టీఆర్‌ఎస్ ఎదురుదాడి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో తలపడాలని టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి సవాలు చేయడం మొదలు పెట్టారు. ఉప ఎన్నికకు భయపడే కోర్టుకు వెళ్లారని ప్రకటనలు చేస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే ప్రజల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉందో తెలిసిపోతుందని పేర్కొంటున్నారు. నల్లగొండ అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు జిల్లా అంతటా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో టీఆర్‌ఎస్ కాలు దువ్వుతోంది. కాగా, కాంగ్రెస్ మాత్రం జరిగిన పరిణామాల వల్ల ఒనగూరిన ప్రయోజనంపై ఆనందంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment