లక్నో, ఉత్తరప్రదేశ్: ఘాజీపూర్ మైనర్ బాలిక కిడ్నాప్, ఆత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది మైనర్ అని చెప్పడంతో తొలుత అతడిని జువెనైల్ (బాల నేరస్తుడు) అని నమ్మించే యత్నం జరిగింది. కానీ వైద్య పరీక్షల్లో వాస్తవం వెలుగుచూసింది. అతడు బాల నేరస్తుడు కాదని, నిందితుడి వయసు 20 ఏళ్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది.
పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని ఘాజీపూర్‌లో గత నెల (ఏప్రిల్) 21న స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న 11 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి, మదర్సాలో బంధించాడు. ఆ చిన్నారిపై డ్రగ్స్ ఇచ్చి కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం గుర్తించారు. అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో మదర్సాలో ఉన్న యువకుడు, మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అని చెప్పడంతో యువకుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
నిందితులలో మౌల్వీ ఉండటంతో ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. కొందరు హిందువులు మౌల్వీ ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించినట్లు అతడి భార్య గతంలో మీడియాకు తెలిపారు. ఓవైపు మతం రంగుతో పాటు మరోవైపు బాల నేరస్తుడు కావడం కేసు క్లిష్టంగా మారింది. కానీ తాజాగా వైద్య పరీక్షల్లో యువకుడి ఎముకల బలాన్ని చెక్ చేయగా, 20 ఏళ్ల యువకుడిగా గుర్తించడంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. ఆ నిందితుడిని జువెనైల్ హోం నుంచి జైలుకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment