మదర్సాల్లో మువ్వన్నెల రెపరెపలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయజెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలుపాలన్న సంకల్పం తీసుకోవాలని, ఈ దిశగా ముందుకు సాగాలంటే ఉత్తరప్రదేశ్ మరింత అభివృద్ధిచెందాల్సి ఉందని ఆయన అన్నారు. ఇక ఈసారి యూపీలోని పలు మదర్సాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. లక్నోలోని ఫిరంగి మహాల్ మదర్సా, బరేలీలోని మరో మదర్సాలోనూ ముస్లిం మత పెద్దలు జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు పాల్గొన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనూ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. వీసీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా ఆగష్టు 15 వేడుకలను నిర్వహించాలని మదర్సా కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మదర్సాల్లో జెండా ఆవిష్కరణతోపాటు జాతీయ గేయం ఆలపించాలని సూచిస్తూ కమిటీ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.
పంద్రాగష్టు సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించటంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మదర్సా శిక్ష పరిషత్‌ను కోరింది. అందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం 8వేల మదర్సాలన్నింటికి పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు 15న సరిగ్గా ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించి, జాతీయ గేయాన్ని ఆలపించాలని కోరింది.