అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్‌ | Lucknow killings case sensational details revealed | Sakshi
Sakshi News home page

మా నాన్న, నేను కలిసి చంపేశాం.. వారి గౌరవాన్ని కాపాడాం

Published Wed, Jan 1 2025 7:35 PM | Last Updated on Wed, Jan 1 2025 7:53 PM

Lucknow killings case sensational details revealed

ల‌క్నోలో ఐదుగురు మ‌హిళ‌ల దారుణ‌ హ‌త్య‌

త‌ల్లి, న‌లుగురు చెల్లెళ్ల‌ను చంపిన అన్న‌

వారి గౌరవాన్ని కాపాడేందుకే హ‌త్య చేశాన‌న్న నిందితుడు

న్యాయం చేయాల‌ని ప్ర‌ధాని, యూపీ సీఎంకు విజ్ఞ‌ప్తి

‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నా సోదరీమణులు చనిపోతున్నారు. కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతాను. మాకు జరిగిట్టుగా ​భారతదేశంలోని ఏ కుటుంబం కూడా వేధింపుల బారిన పడకుండా చూడాలి. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాతైనా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. రాజకీయ నాయకులు, పోలీసులతో వారికి సంబంధాలున్నాయి. మా స్థలంలో సగం లాక్కున్నారు. మరో సగం కూడా గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు’- యూపీ రాజధాని లక్నోలో ఐదుగురు కుటుంబ సభ్యులను కిరాతంగా హత్య చేసిన అర్షద్‌(24) మాటలివి. తన తండ్రి సహాయంతో తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను అర్షద్‌ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను హత్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించాడు.

చెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేకనే..
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ పట్టణం అర్షద్ స్వస్థలం. తమ పొరుగున్న వారు, ల్యాండ్‌ మాఫియాతో కలిసి వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్షద్‌ వెల్లడించాడు. తనను, తన తండ్రిని కుట్ర‌పూరితంగా దొంగ కేసుల్లో ఇరికించి.. తమ చెల్లెళ్లను అమ్మేయాలని చూశారని అతడు ఆరోపించాడు. దీంతో తన చెల్లెళ్లను చంపుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. వేధింపులు భరించలేక ఒక దశలో తామంతా మతం మారాలనుకున్నామని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అభ్యర్థించాడు.  

మాకెవరూ అండగా నిలబడలేదు
‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మా అమ్మ, నా చెల్లెళ్లను నేనే చంపాను. నేను మాట్లాడిన ఈ వీడియో పోలీసులుకు దొరికినప్పుడు స్థానికులే బాధ్యులని వారికి తెలుస్తుంది. మా ఇంటిని కబ్జా చేసేందుకు నానారకాలుగా వేధించినా మేము గట్టిగా ప్రతిఘటించాం. కానీ మాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఇల్లు వ‌దిలిపెట్టి 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయాం. పిల్లలు చలిలో తిరగడం మాకు ఇష్టం లేదు. కబ్జాకోరులు మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పత్రాలు మా దగ్గరే ఉన్నాయ’ని అర్షద్ తన వీడియోలో తెలిపాడు.

ఈ హత్యలకు బాధ్యులు వారే..
తమ కుటుంబ నాశనానికి రాణు, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ అనే వ్యక్తులు కారణమని అర్షద్ ఆరోపించాడు. బంగ్లాదీశీయులమని తమపై అసత్య ప్రచారం చేశారని వాపోయాడు. ‘వాళ్లు ల్యాండ్ మాఫియా. ఆడపిల్లలను అమ్మేస్తారు. నన్ను, మా నాన్నను తప్పుడు కేసులో ఇరికించి.. మా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మేయాలని ప్లాన్ చేశారు. వాళ్ల బారిని నుంచి తప్పించడానికి మాకు మార్గం మ‌రో లేకుండా పోయింది. అందుకే మా నాన్న సహకారంతో నా సోదరీమణులను గొంతు, మణికట్టు కోసి బలవంతంగా చంపాల్సి వచ్చింది. వారి గౌరవాన్ని కాపాడటానికి మాకు ఇంత కంటే మార్గం తోచలేదు. నేను ఉదయం వరకు జీవించి ఉండకపోవచ్చు. మా స్థలాన్ని ప్రార్థనాలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాల’ని అర్షద్ తెలిపాడు. తన వీడియోలో తల్లి, చెల్లెళ్ల మృతదేహాలను చూపించాడు.

చ‌ద‌వండి: ట్యూషన్‌ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

కొన‌సాగుతున్న విచార‌ణ‌
హోటల్‌ శరణ్‌జిత్‌లో ఐదుగురు మహిళల హత్యలు జరిగాయని సెంట్రల్‌ లక్నో డిప్యూటీ పోలీసు కమిషనర్‌ రవీనా త్యాగి తెలిపారు. ఘటనా స్థలంలోనే నిందితుడు అర్షద్‌ను అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్‌ నిపుణులు శాంపిల్స్‌ సేకరించారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement