
ట్వీడ్ కోటు
ఆంధ్రా నాన్ - బ్రాహ్మిన్ స్టూడెంట్స్ హాస్టల్, మద్రాస్, డిసెంబర్, 1921
తెల్లని ప్లానెల్ ప్యాంటు, మోచేతుల పైకి మడిచిన లినెన్ షర్టు, సుద్దతో పాలిష్ చేసిన కాన్వాస్ బూట్లు, భుజం మీద లూజుగా తగిలించుకున్న ట్వీడ్‌కోటు, చేతిలో డన్‌లప్ రాకెట్‌తో ఈల వేస్తూ హాస్టల్ మెట్లు దిగాడు సారథి. వరండాలో పేముకుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తున్న రమాపతిని చూస్తూనే ‘ఏం బ్రదర్! ఎన్నా సమాచారం?’ అని బల్ల మీదున్న ఆంధ్రప్రకాశిక, జస్టిస్, ద్రవిడియన్‌ల దొంతర లోంచి హిందూ పేపర్ బయటకి లాగి స్పోర్ట్స్ పేజీ తెరిచాడు.
‘ఏముందిరా! గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపునిచ్చాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో విదేశీవస్త్రాలు తగలబెట్టి ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలూ బహిష్కరించే కార్యక్రమం చేపడుతున్నాం. మన హాస్టల్లో కూడా ప్రదర్శన నిర్వహించబోతున్నాం’ అన్నాడు రమాపతి. అతడు యూనివర్సిటీలో ఎకనామిక్స్ హానర్స్ చేస్తున్నాడు.
‘నాన్సెన్స్.. హాయిగా మనవాళ్ల ప్రభుత్వముంటే నాన్ కోపరేషన్ దేనికోయ్? రాకరాక మనకీ బ్రాహ్మణ ఆధిపత్యం నుండి విముక్తి వస్తే ఇంకా కాంగ్రెస్సూ, గాంధీ అని వేలాడుతావ్? స్వాతంత్య్రమే వచ్చి కాంగ్రెస్ పాలనంటే మళ్లీ ఈ బ్రాహ్మణులని తెచ్చి నెత్తిన పెట్టుకోవడమే’
‘జాతీయోద్యమాన్ని రాజకీయ పార్టీలతో ముడిపెట్టకు సారథీ... ఇది మన భారతీయుల మనుగడకి సంబంధించిన సమస్య. ప్రతి యేడూ మన సంపద ఎంత దేశం విడిచిపోతుందో నీకు తెలుసా? దేశం పూర్తిగా మట్టిగొట్టుకుపోయేలోగా ఈ తెల్లవాళ్లని బయటికి తోలకపోతే మనకే నష్టం. ఆ పని సాధించడానికి గాంధీజీ ఒక్కడే మనకి కనిపిస్తున్న ఆశాజ్యోతి’...
‘ఆహా! వందేళ్లుగా భూమిని నమ్ముకొని పండించినదంతా ఆ బ్రాహ్మణుల పరంజేస్తే, కనీసం మనకి ఓనమాలకి కూడా దిక్కులేదు. ఇప్పుడిప్పుడే ఇంగ్లిషు చదువుల పుణ్యమా అని కాస్త ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ఇంగ్లిషోళ్లు ఉంటేనే మనవాళ్ల అభివృద్ధికి అవకాశం. ముందు మన యింటిని చక్కదిద్దుకొని తరువాత దేశాన్ని ఏలే పని చూస్తే మంచిది. నువ్వే చూడు ఈ మద్రాస్ రాష్ట్రంలో మన జనాభా 86 శాతం ఉంటే బ్రాహ్మణుల జనాభా 3 శాతం. కానీ మనవాళ్లు ముగ్గురు సబ్‌జడ్జీలయితే 15 మంది బ్రాహ్మలు. కనీసం సగం ఉద్యోగాలన్నా మనవాళ్లకి రావాలంటే మన జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే మంచిది’....ఎల్.ఎల్.బి ఫైనలియర్ కాగానే జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో జేరాలని సారథి ఉద్దేశ్యం. అది జస్టిస్ గవర్నమెంట్లో అయితే సానుకూలం అవుతుందని ఆశ.
‘నీతో వాదనెందుకు? దొరలా తయారయ్యావ్. ఆటకి టైం అయినట్లుంది బయలుదేరు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఏదో ఒకరోజు నీ అంతట నువ్వే ఆ ట్వీడ్‌కోటు వదిలి ఖద్దరు కడతావ్’ అని పేపర్లో తలదూర్చాడు రమాపతి. ‘అసంభవం. ఇలాంటి ఉద్యమాలన్నీ మూణ్ణాళ్ల ముచ్చట్లే. నీకే తెలిసొస్తుందిలే’ అంటూ సైకిలెక్కాడు సారథి.
సిగరెట్ అంటించి హాస్టల్ మేడపై నుండి చోద్యం చూస్తున్నాడు సారథి. భరతఖండంబు చక్కని పాడియావు తెల్లవారను గడుసరి గొల్లవారు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి! మెగాఫోన్ పట్టుకొని రమాపతి శ్రావ్యంగా పాడుతుంటే చుట్టూ చేరిన విద్యార్థులంతా గొంతు కలిపారు. హాస్టల్ నుండి పాతికకి పైగ విద్యార్థులు ఖద్దరు బట్టలలో మూడురంగుల జెండాలతో ఊరేగింపుగా బయలుదేరారు. వందేమాతరం నినాదాలు మిన్నంటాయి.
గేటు దాటి బయటకు అడుగుపెట్టారో లేదో పోలీసులు అడ్డువచ్చారు. వెంటనే ‘పోలీస్ గో బ్యాక్’ నినాదాలు మొదలయ్యాయి. ‘ఆగండి’ మెగాఫోన్‌లో అరిచాడు రమాపతి. ‘మమ్మల్ని ఎందుకు ఆపారో చెప్పగలరా?’ మర్యాదగా అడిగాడు. ‘పబ్లిక్ ప్రదర్శనకి అనుమతి లేదు. 144 సెక్షన్ ఉంది. శీగ్రం రూముకు పోండి’ అన్నాడు తమిళ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లాఠీ ఝళిపిస్తూ. ‘శాంతియుతంగా చేసే ప్రదర్శన వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. మేమెటువంటి న్యూసెన్స్ కలిగించడంలేదు. అందు వల్ల ఇది మీ సెక్షన్ పరిధిలోకి రాదు. ీప్లీజ్ తప్పుకోండి’ అని ఒకడుగు ముందుకేశాడు రమాపతి. ‘అడుగు ముందుకేస్తే కాళ్లు ఇరిగిడుస్తాయ్’ అంటూ లాఠీ ఎత్తాడు. ‘సరే. అలాగే కానివ్వండి’ అని ముందడుగేశాడు.
ముంగాలి మీద పడిన లాఠీ దెబ్బకి అబ్బా అంటూ తూలిపడబోయాడు రమాపతి. ఆవేశంతో ముందుకి దూకిన విద్యార్థులని ఒక చేతితో వారిస్తూ ‘నాకేమైనా సరే ఆవేశపడొద్దు’ అని నచ్చచెప్పి ‘వందేమాతరం’ అంటూ మరో అడుగు ముందుకేశాడు.
మరోదెబ్బ!
కిందబడ్డా ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అంటూ గరిమెళ్ల రాసిన గీతాన్ని పాడుతూ మళ్లీ లేచాడు. ఈసారి దెబ్బ తల మీద పడింది. నుదుటి మీద కారే నెత్తురుతో పడిపోయిన రమాపతి చేతిలోని మెగాఫోన్ అందుకొని, మేలుకోవోయ్ భరత్‌పుత్రా మేలుకోవోయ్ చిరచరిత్రా పిలుచుచున్నది వీరభారతి అని పాడుతూ మరో యువకుడు ముందుకొచ్చాడు. మళ్లీ లాఠీ ప్రహారాలు. కిందపడిన వాడి స్థానంలో మరొకడు. కానీ పాట మాత్రం ఆగలేదు. తోటి స్నేహితులపైన దౌర్జన్యాన్ని చూస్తూ ఉండలేక పరిగెత్తుకు వచ్చాడు సారథి. స్పృహ కోల్పోయిన రమాపతిని చేతుల్లోకి ఎత్తుకుని అలాగే మోసుకుంటూ ట్వీడ్‌కోటు నెత్తురులో తడుస్తున్నా లెక్కచేయకుండా ‘దిసీజ్ ఇన్టాలరబుల్’ అని అరుస్తూ పోలీసుల వంక నడిచాడు.
అప్పటికే గుమికూడిన వార్తాపత్రికల ఫొటోగ్రాఫర్లు ఆరడుగుల ఎత్తూ, టెన్నిస్ ఆటవల్ల కండలు తిరిగిన శరీరంతో, రక్తమోడుతున్న స్నేహితుడిని ఎత్తుకొని వచ్చే యువకుడి ఛాయాచిత్రం తమ కెమెరాలలో బంధించేందుకు పోటీపడ్డారు. హాస్టల్ నుండి ఎగ్మోర్ ఆసుపత్రి రెండు మైళ్లు. ‘గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏ సెక్షన్ కింద అనుమతి కావాలో తెలుసుకొని రండి’ ఇంగ్లిష్‌లో దబాయిస్తూ పోలీసులని పక్కకి తోస్తూ ‘మిత్రులారా నా వెనకనే రండి’ అంటూ ముందుకి సాగాడు.
అంత వరకూ చోద్యం చూస్తున్న విద్యార్థులూ చుట్టుపక్కల పౌరులూ అతనితో కలిశారు. రెండు మైళ్లు సాగిన ఆ నిరసన ఎగ్మోర్ చేరుకునేసరికి వెయ్యిమందికి పైగా పౌరులున్న ప్రభంజనంగా మారింది. గంట తర్వాత తలకి కట్టుతో ఊతకర్రతో ఆస్పత్రి బయటకి వచ్చిన రమాపతిని గాఢంగా కౌగిలించుకొని ‘నువ్వు చెప్పిందే రైటోయ్. పద నా ట్వీడ్‌కోటు తగలబెట్టేందుకు అవకాశం ఇస్తాను’ అంటూ పదడుగుల ఎత్తున మండుతున్న విదేశీ వస్త్రాల గుట్టపై తన ట్వీడ్‌కోటుని విసిరేశాడు సారథి. రమాపతి మెచ్చుకోలుగా నవ్వాడు.
‘నీ పుణ్యమా అని ఈసారి పండుగకి వెళ్లే మనవాళ్లకి లగేజీ బాధలేదోయ్ రమాపతీ’ అని తనూ నవ్వాడు సారథి.
- సాయి పాపినేని
ఫోన్: +91 98450 34442