ప్రతీయేటా జూలై 15న స్వాతంత్ర్యసమరయోధుడు, రాజనీతిజ్ఞుడు కుమారస్వామి కామరాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. కామరాజ్ రాజకీయ చతురతకు పేరుగాంచారు. జవహల్‌లాల్ నెహ్రూ మరణాంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కామరాజ్ పార్టీకి సారధ్యం వహించారు. కామరాజ్ తనకు ప్రధానమంత్రికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా ఆ అవకాశాన్ని లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీలకు కల్పించడంలో ప్రధాన భూమిక వహించారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి
నాటి రోజుల్లో ఒక నేతగా, ముఖ్యమంత్రిగా కామరాజ్ మద్రాస్(ప్రస్తుతం తమిళనాడు)లో విశేష రీతిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఆయన భారీగా పెట్టుబడులు కేటాయించారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. ఇందుకు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం దోహదపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్న పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నారు. కామరాజ్ జన్మదినాన తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ‘ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ డే’ని నిర్వహిస్తుంటారు.
పాఠశాల విద్య పూర్తి కాకుండానే..
కామరాజ్ నాడార్ (వెనుకబడిన కులం) కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి కాకుండానే తన 11 సంవత్సరాల వయస్సులో మదురై సమీపంలోని తన మామ కిరాణా దుకాణంలో పని చేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలపై, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్‌ను నాటి జలియన్‌వాలాబాగ్ ఊచకోత అమితంగా కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్‌గా చేరిన కామరాజ్ 1940లో పార్టీ మద్రాసురాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ కామరాజ్‌ను మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలోనే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది.
ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..
ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరిపించి..
1952లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది సి రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడిని (కామరాజ్) నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఆ పదవిని అధిష్టించిన కామరాజ్ తొలుత 1953లో రాజాజీ ప్రవేశపెట్టిన కుల ఆధారిత సవరించిన ప్రాథమిక విద్య పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. తన పదవీకాలంలో 12,000 పాఠశాలలను నిర్మించారు. 11వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు.
పార్టీకి కలసివచ్చిన కామరాజ్ ప్రణాళిక
1963లో నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలోనూ మెదిలింది. అప్పుడే పార్టీని పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు కామరాజ్ ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వంలో ఉన్న నేతలు సంస్థాగత పనులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. 1963 ఆగస్టు 10న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో కామరాజ్ ప్రణాళిక ఆమోదం పొందింది.
శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ
1964 మే 27న నెహ్రూ మరణించారు. నెహ్రూ లాంటి వారు మరొకరు లభ్యం కారని భావించిన కామరాజ్ వివాద రహిత నేత లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కామరాజ్ పార్టీని సమాఖ్య నాయకత్వ వ్యవస్థ వైపు నడిపించడానికి ప్రయత్నించారు. 1966లో శాస్త్రి కన్నుమూశారు. అనంతరం గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ, శాస్త్రిలను కోల్పోయిన క్లిష్ట సమయాలను కాంగ్రెస్ అధిగమించేందుకు కామరాజ్ విశేష కృషి చేశారు. అనంతరం శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నుకోవడంలో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. 1966 జనవరి 24న ఇందిర ప్రధాని పదవిని అలంకరించారు.
72 ఏళ్ల వయసులో కన్నుమూత
ఇందిరాగాంధీ పదవిలో ఉన్న సమయంలో ఆమె మద్దతుదారులకు, మరికొందరు పార్టీ నేతలకు మధ్య విబేధాలు పొడచూపాయి. ఇది చివరకు 1969లో పార్టీ చీలికకు దారితీసింది. పార్టీపై కామరాజు ప్రభావం తగ్గిపోయింది. 1967 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించింది. కామరాజ్ ఓటమి పాలయ్యారు. 1971లో ఇందిరను ఓడించాలని భావించిన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇందిరా కాంగ్రెస్ (రిక్విజిషన్) కాంగ్రెస్ (ఓ)ని ఘోరంగా ఓడించింది. కామరాజ్ 1975లో తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి..
Comments
Please login to add a commentAdd a comment