
సీ రంగరాజన్-మాంటెక్ సింగ్ అహ్లువాలియా
చెన్నై: సబ్సిడీ భారం తగ్గింపునకు మరిన్ని చర్యలు అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ఆయా అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సదరన్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రంగరాజన్ పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును కేంద్రం జీడీపీలో 4.8%కు కట్టడి చేయగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వస్తువులు, సేవల పన్ను 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి వస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారత్ రుణ భారం తగ్గాలి: మాంటెక్
భారత్ రుణ భారం ఐదారు సంవత్సరాల్లో తగ్గాల్సిన అవసరం ఉందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ఇందుకు సమర్ధవంతమైన ద్రవ్య విధాన బాటను అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు.