
నయన ఓకే అన్నారు.. కానీ..
నయనతారకు కథ నచ్చింది. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా ఆ పాత్రలో ఇప్పుడు హన్సిక నటిస్తున్నారు.
నయనతారకు కథ నచ్చింది. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా ఆ పాత్రలో ఇప్పుడు హన్సిక నటిస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ. సినిమా అంటే అంతే. ఏ పాత్ర ఎవర్ని వరిస్తుందో చెప్పడం అసాధ్యం. జయం రవి, హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం రోమియో జ్యూలియట్. లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటించాల్సి ఉంది. ఈ భామకు దర్శకుడు కథ వినిపించారు. పాత్ర నచ్చడంతో పారితోషికం తగ్గించుకుని మరీ నటించడానికి ఓకే చెప్పారట. అయినా ఆమెను కాదని మరో క్రేజీ హీరోయిన్ హన్సికను హీరోయిన్‌గా ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. నయనతారకంటే హన్సికనే బెటర్ అనిపించారా? అన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ నిజమే రోమియో జ్యూలియట్ చిత్రం కథను మొదట నయనతారకే చెప్పానన్నారు.
ఆమెకు కథ బాగా నచ్చడంతో పారితోషికం తగ్గించుకుని నటిస్తానన్నమాట నిజమేనన్నారు. దీంతో తాను సంతోషించానని తెలిపారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే జయం రవి, నయనతార జంటగా ఇప్పటికే జయం రవి దర్శకత్వంలో నటిస్తున్నారని తెలిసిందన్నారు. మళ్లీ వెంటనే వీరితో రోమియో జ్యూలియట్ చిత్రాన్ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు మొనాటనీ ఫీలవుతారని భావించామన్నారు. ఈ కారణంగానే నయనతార పాత్రలో హన్సికను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ విషయం గురించి నయనతారను స్వయంగా కలిసి స్పష్టంగా వివరించానన్నారు. ఆమె కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.