
చిత్రపరిశ్రమలో క్రేజ్ ఉన్నంత వరకూ వయసు ఓ సమస్యే కాదు. నటి నయనతార విషయంలో ఇదే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఈమె ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. కాగా తాజాగా మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈమె నటించిన తాజా చిత్రం టెస్ట్ చిత్రం ఇటీవలే నేరుగా ఓటీటీలో విడుదలైంది. అంతకు ముందు నయనతార టైటిల్ పాత్రను పోషించిన అన్నపూరిణి చిత్రం నిరాశపరచింది. అయితే ఈ సంచలన నటి జయాపజయాలను ఎప్పుడో దాటేశారు. అందుకు ఉదాహరణ ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్న చిత్రాలే. పెళ్లి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు. అయినా కథానాయకిగా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. నటుడు యోగిబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండావది డియర్ స్టూడింట్స్.. ఇది మలయాళ చిత్రం. సతీష్‌కుమార్,జార్జ్ ఫిలిప్ రేల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.నటుడు నవీన్ బాలి కథానాయకుడిగా నటిస్తున్నారు. మూడో చిత్రం టాక్సిక్.. ఇది కన్నడ చిత్రం. నటుడు యష్ నాయకుడిగా నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగో చిత్రం రాకాయి. ఇది నయనతార నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం.సెంథిల్ నలసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఐదో చిత్రం మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మెరు2). దీనికి సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ఐసరి గణేశన్‌కు చెందిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి నటి కుష్భూకు చెందిన అవ్నీ మూవీ మాక్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆరో చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది నయనతార నటించే 81వ చిత్రం.
ఏడో చిత్రం మలమాళ చిత్రం. నటుడు మోహన్‌లాల్, మమ్ముట్టిలతో కలసి నటిస్తున్నారు. దీనికి మహేశ్ నారాయణన్ దర్శకుడు. ఎనిమిదో చిత్రాన్ని నటుడు రవిమోహన్‌కు జంటగా నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తనీఒరువన్‌కు సీక్వెల్. ఇక తొమ్మిదో చిత్రం హాయ్. ఇందులో యువ నటుడు కవిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి విష్ణు ఎడ్వన్ దర్శకుడు. ఇలా ఏక కాలంలో తమిళం, కన్నడం,మలయాళం భాషల్లో 9 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక కథానాయకి నయనతార మాత్రమే అని చెప్పవచ్పు. అదే విధంగా ఈ సంచలన నటి త్వరలోనే సెంచరీ కొట్టడానికి సిద్ధం అవుతోందన్నమాట.