గుబాళిస్తున్న మహిళావిజయం
వేసవి వచ్చిందంటే మల్లెపూలు విరగబూస్తాయి. మల్లెచెట్లు పెంచే రైతులకు చేతినిండా సొమ్ములే. ఈ విషయం గమనించిన మద్రాసు మహిళారైతులు మల్లెపూల తోటలనే నమ్ముకుని బతుకుతున్నారు. ఇలాంటి మహిళా రైతుల సంఖ్యను పెంచడం కోసం మద్రాసు ప్రభుత్వం సూక్ష్మరుణాల పేరుతో ఆర్థికసాయం చేస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మహిళారైతులు మల్లెతోటలసాగులో మంచి లాభాలను చూస్తున్నారు.
‘‘ప్రభుత్వమిచ్చే రుణంతో ఏ పంటసాగైనా చేసుకోవచ్చు. మేం మాత్రం అచ్చంగా మల్లెతోటలనే నమ్ముకుని బతుకుతున్నాం. మొక్కలు పెంచడం దగ్గర నుంచి మొగ్గలు తెంపడం వరకూ అన్ని పనులూ మేమే స్వయంగా చేసుకుంటున్నాం. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. అలాగే అమ్మకం కూడా నేరుగా చేసుకోవడం వల్ల దళారుల జోక్యం కూడా లేదు’’ అని చెప్పారు భాగ్యలక్ష్మి అనే మహిళారైతు. కాలానికి తగ్గ పూలను పెంచుకుంటూ లాభాలను చూస్తున్న మహిళారైతుల సంఖ్య రోజురోజుకీ పెరగాలని కోరుకుందాం!