బెంగళూరు(బనశంకరి) : మూడ్రోజలు క్రితం పాత మద్రాస్ రోడ్డులో బీఎంటీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన చోటు చేసుకుంది. లగ్గెరీ ఫ్లై ఓవర్‌పై వెళుతున్న బీఎంటీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, కాలిపోయింది. కెంగేరి నుంచి యశ్వంతపురకు వెళుతున్న బీఎంటీసీ బస్సు ఉదయం 11 గంటలకు లగ్గెరీ ఫ్లై ఓవర్‌పైకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజన్‌లో నిప్పు రాజుకుంది. మంటలు గుర్తించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపి ప్రయాణికులను కిందకు దిగాలని సూచించాడు.
ప్రయాణికులు కిందకు దిగుతుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు చుట్టుముట్టక ముందే ప్రయాణికులు కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనపై రాజగోపాల నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీఎంటీసీ బస్సులో మంటలు
Published Fri, Jan 30 2015 1:47 AM | Last Updated on Mon, Oct 8 2018 4:08 PM
Advertisement