
వర్ధమాన దర్శకుడితో రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాతి సినిమా ఏంటి? దీని మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో తనకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్‌తో ఆయన ఒక మెగా బడ్జెట్ సినిమా చేయనున్నారని ఆ మధ్య వార్త వచ్చింది. అయితే, తాజా కబురేమిటంటే - ఆ సినిమా కన్నా ముందే ఈ సూపర్‌స్టార్ మరొక సినిమా చేయనున్నారట! ఇటీవల తమిళంలో బాగా పేరు తెచ్చుకున్న ‘మద్రాస్’, ‘అట్టా కత్తి’ చిత్రాల ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుందట.
ఈ జూలై నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని భోగట్టా. గత డిసెంబర్‌లో విడుదలైన ‘లింగ’ సూపర్‌ఫ్లాప్ అయిన తరువాత ఇప్పుడీ సినిమాతో రజనీకాంత్ తన పాత వైభవాన్ని చూపుతారా అన్నది ప్రశ్న. ఏమైనా, దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా అభిమానులున్న రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్, రంజిత్ లాంటి వర్ధమైన దర్శకుడితో సినిమా చేయనున్నారన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దర్శకుడు రంజిత్ ఈ వ్యవహారంపై ప్రకటన ఏమీ చేయలేదు కానీ, ఆయన తీసిన ‘మద్రాస్’ సినిమాపై రజనీకాంత్ గతంలో ప్రశంసల జల్లు కురిపించారు. ఆ విషయాన్ని అప్పట్లో రంజిత్ బాహాటంగా ట్విట్టర్‌లో ప్రకటించారు.
కాబట్టి, వీళ్ళ కాంబినేషన్ ఖాయమే అన్నమాట! ఇది ఇలా ఉండగా, రంజిత్‌కు మార్గదర్శకుడైన దర్శకుడు వెంకట్ ప్రభు ‘యు మేడ్ మి రియల్ ప్రౌడ్ రంజిత్! వాట్ ఎ మూమెంట్! లవ్ యు డా!...’ అంటూ తాజాగా ట్వీట్ చేశారు. దీన్నిబట్టి, రజనీతో సినిమా ఖాయమైందనుకోవచ్చు.
మరో ‘బాషా’? రంజిత్ తెరకెక్కించే కథ ఎలా ఉంటుందన్నది మరో ప్రశ్న. ‘మద్రాస్’ సినిమా లాగానే ఇందులోనూ రాజకీయ వాసనలుంటాయా అని ఒక చర్చ మొదలైంది. అయితే, ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ‘బాషా’ తరువాత మళ్ళీ ఇందులో రజనీకాంత్ పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించే సూచనలున్నాయట! ఈ సారి తన వయసుకు తగ్గ పాత్ర చేయాలనీ, నటనకు బాగా అవకాశం ఉండే సహజమైన సినిమా చేయాలనీ రజనీ బలంగా అనుకుంటున్నారట! అందుకే, ఇతరులు చెప్పిన కథలన్నిటి కన్నా రంజిత్ చెప్పిన ఈ కథ ఆయనకు నచ్చిందట! ఇంకేం, జూలై ఆఖరులో సినిమా మొదలైతే, వీలుంటే ఈ ఏడాది చివరకల్లా మరోసారి రజనీని వెండితెరపై చూడవచ్చన్న మాట!