కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్‌ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్‌గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.
సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్‌లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్‌మెంట్‌తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.
సామాజిక వివక్షే కథగా...
అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.
2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.
పోరాట యోధులుగా...
సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.
కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.
దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్‌కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.
కఠినమైన వాస్తవాలతో...
తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్‌ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే.
కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్‌కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు
Comments
Please login to add a commentAdd a comment