
ఈసారి...విద్యాబాలన్
రజనీకాంత్ కొత్త సినిమాకు చకచకా సన్నాహాలు సాగిపోతున్నాయి. తాజా కబురేమిటంటే... ఆయన సరసన హీరోయిన్‌గా విద్యాబాలన్ ఎంపికయ్యారు. తమిళమూలాలున్న తల్లితండ్రులకు జన్మించిన ఈ ఉత్తరాదిభామ ఇలా తొలిసారిగా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనువిందు చేయనున్నారు. తమిళంలో ఇటీవల ‘మద్రాస్’, ‘అట్ట కత్తి’ చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 1 నుంచి మలేసియాలో జరగనుంది. విశేషం ఏమిటంటే, రజనీకాంత్ సినిమా అనగానే ఎ.ఆర్. రెహమాన్ లాంటి సంగీత దర్శకులు, పి.సి. శ్రీరామ్ లాంటి సీనియర్ సాంకేతిక నిపుణులు పని చేస్తారని భావిస్తారు.
కానీ, ఈ సారి రజనీ పూర్తిగా స్టైల్ మార్చేశారు. దర్శకుడు రంజిత్ వద్ద గత చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడు (సంతోష్ నారాయణన్), కెమేరామన్ (జి. మురళి) తదితరులనే ఈ సినిమాకూ కొనసాగించడానికి ఆయన ఒప్పుకున్నారు. మలేసియాలో 60 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుతారని భోగట్టా. ఆ తరువాత థాయిలాండ్, హాంగ్‌కాంగ్, చెన్నైలలో షూటింగ్ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి, రజనీకాంత్‌తో సినిమా చేయాలన్నది నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను చిరకాల కోరిక. రజనీకాంత్ తొలిసారిగా సోలో హీరోగా నటించిన తమిళ చిత్రం ‘భైరవి’ని 1978లో పంపిణీ చేసింది - థానుయే! ‘సూపర్‌స్టార్’ అనే బిరుదును రజనీకాంత్ పేరు ముందు తగిలించింది కూడా ఆయనే.
అప్పటి నుంచి ఎప్పటికైనా రజనీతో సినిమా చేయాలని థాను ఉవ్విళ్ళూరుతున్నారు. 37 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఆయన కల ఇన్నాళ్ళకు ఫలిస్తోంది. అందులోనూ ‘డర్టీపిక్చర్’, ‘కహానీ’ లాంటి సినిమాల ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టీనీ ఆకర్షించిన విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించడం సంచలనవార్తే. మొన్న ‘కొచ్చాడయాన్’లో దీపికాపదుకొనే, నిన్న ‘లింగ’లో బాలీవుడ్ తార సోనాక్షీ సిన్హాతో స్టెప్పులేసిన రజనీ ఈసారి ఈ ‘పాలక్కాడ్ పొన్ను’తో అలరిస్తారన్న మాట. ఇంట్లో తమిళ, మలయాళాలను కలగలిపి మాట్లాడే విద్యాబాలన్‌కు కూడా ఇది కొత్త అనుభవం, సరికొత్త సంతోషం కదూ!