
సూపర్‌స్టార్‌కు హ్యాండిచ్చిన విద్యాబాలన్
బాలీవుడ్ భామ విద్యాబాలన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మరోసారి హ్యాండిచ్చారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్‌తో నటించడానికి ఒక పక్క ప్రముఖ కథానాయికల నుంచి యువ నాయికల వరకూ పరితపిస్తుంటే, నటి విద్యాబాలన్‌కు మాత్రం అలాంటి లక్కీఛాన్స్ మూడు సార్లు తలుపుతట్టింది. అయినా ఆ జాణ సద్వినియోగం చేసుకోలేకపోతోందనే చెప్పాలి. ది దర్టీ పిక్చర్ చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్‌కు ఇంతకు ముందు లింగా చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది.
దాన్నే కాదు కదా ఆ తరువాత కబాలి చిత్రంలోనూ ఆమెకే ముందు అవకాశం వచ్చింది. దాన్ని విద్యాబాలన్ అందుకోలేకపోయింది. తాజాగా మరోసారి వచ్చిన అవకాశాన్ని ఈ అమ్మడు కాలదన్నుకుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా కబాలి–2 చిత్రానికి రెడీ అవుతున్నారు. పా.రంజిత్‌నే దర్శకత్వం వహించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రజనీకాంత్ అల్లుడు, యువ స్టార్ నటుడు ధనుష్ హ్యాడింల్ చేస్తున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాటలకు బాణీలు కట్టడంలో బిజీగా ఉన్నారు. చిత్రం షూటింగ్ ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం.
అయితే ఇందులో నటి విద్యాబాలన్ నాయకిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోనూ ఆమె నటించడంలేదని తెలిసింది. కాల్‌షీట్స్ సమస్య కారణంగానే విద్యాబాలన్ రజనీకాంత్ చిత్రాన్ని అంగీకరించలేకపోయిందని సమాచారం. దీంతో మరో బాలీవుడ్ బ్యూటీ కోసం కబాలి–2 చిత్ర యూనిట్ వేట మొదలెట్టిందని తెలిసింది.