
మేమంతా ఓటేశాం.. మరి మీరో?
ఈసారి రికార్డు సంఖ్యలో యువతీ యువకులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వాళ్లందరికీ ఓటరు గుర్తింపుకార్డులు కూడా వచ్చాయి. అయితే వాళ్లలో ఎంతమంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు? ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పలువురు ప్రముఖులు పిలుపునివ్వడమే కాదు, క్షణం తీరిక లేకపోయినా ఉదయమే వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఇలాంటి వారిలో పలువురు అగ్రశ్రేణి సినీనటులు కూడా ఉన్నారు.
తమిళనాట అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కూడా చెన్నైలో తమ నివాసాలకు సమీపంలోఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూడా ఓటు వేశారు. బాలీవుడ్ విలక్షణ నాయకుడు, దర్శక నిర్మాత అమీర్ఖాన్, ఇటీవలే పెళ్లి చేసుకున్న విద్యాబాలన్, యువ హీరోయిన్ సోనమ్ కపూర్.. ఇలా అందరూ గురువారం ఉదయమే వెళ్లి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తామంతా ఓటు వేశామని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని యువతీ యువకులంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ తరఫున ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న అమీర్ ఖాన్, తాను కూడా స్వయంగా ఓటు వేయడం ద్వారా అందరినీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.