
‘ది మెడ్రాస్ సాంగ్’ ఆవిష్కరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఏర్పడి 375 సంవత్సరాలైన సందర్భం గా ఇక్కడి విశేషాలను, విశిష్టతను ప్రతిబింబిస్తూ మురుగప్ప గ్రూప్‌సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ‘ది మెడ్రాస్ సాంగ్’ ఆడియో, వీడియో (ఏవీ)ను సోమవారం విడుదల చేశారు. అనంతరం మీడియాకు ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన మోడల్, సినీనటి యాస్మిన్ పోనప్పపై చెన్నై నగరంలోని పలు ముఖ్యప్రాంతాలపై పాటను చిత్రీకరించారు. సెంట్రల్ స్టేషన్, సీజన్‌లకు అతీతంగా నిత్యం రద్దీగా ఉండే రంగనాథన్ తెరు, పట్టువస్త్రాలకు పేరెన్నికగన్న పలుషాపులు, రుచికరమైన హోటళ్లు ఇలా మద్రాసులోని ప్రాముఖ్యతలకు పాటలో అద్దంపట్టారు.
చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సంగీత కళాకారిణి సుధా రఘునాథన్, సినీదర్శకులు గౌతమ్ మీనన్, గాత్ర విద్వాంసుడు అలాప్‌రాజు, హరిచరణ్, నరేష్ అయ్యర్ తదితరులు పాటలో కనిపించి అలరించారు. విజయ్‌ప్రభాకరన్ పాట చిత్రీకరణకు దర్శకత్వం వహించగా, గేయరచనను సుబ్బు, స్వర రచనను విశాల్ చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ వైస్ చైర్మన్ ఎంఎం మురుగప్పన్ మాట్లాడుతూ, దేశంలో అనేక నగరాలున్నా మద్రాసు నగరానికి ఉన్న ప్రత్యేకతలు మిగిలిన వాటికి లేవన్నారు.
భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాచీన సంప్రదాయాలను నేటీకీ పాటిస్తున్న నగరంగా మద్రాసు పేరొందినట్లు తెలిపారు. విద్య, వైద్యం, నృత్య, సంగీత, సాహిత్య కళలకు మద్రాసు నగరం కాణాచిగా ఆయన అభివర్ణించారు. తాను మద్రాసులో పుట్టాను, చెన్నైలో జీవిస్తున్నానని చమత్కరించారు. చెన్నై అనేది నగరానికి పేరు మాత్రమే, మద్రాసు అనేది మనస్సుకు హత్తుకునే ఒక ఆనందకరమైన శబ్దమన్నారు. అందుకే తాము రూపొందించిన పాటకు ది మెడ్రాస్ సాంగ్ అని పేరు పెట్టామన్నారు. కస్తూరీ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాజీవ్‌లోచన, డెరైక్టర్లు రమేష్ మీనన్ పాల్గొన్నారు. ఈ పాటను సోమవారం అర్ధరాత్రి నుంచి మురుగప్ప యూట్యూబ్‌లో వీక్షించే అవకాశాన్ని కల్పించారు.