సాక్షి, చెన్నై: ప్రభుత్వ వేడుకలు, ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు విద్యార్థులను తరలించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వారు పశువులు కాదని, చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులన్న విషయాన్ని గుర్తించాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు మందలించారు. విద్యార్థులను ఈ విధమైన వేడుకలకు పంపిస్తే చర్యలు తప్పవని చెప్పింది. అంతేకాక పంపించేందుకు అనుమతి లేదని, దీనిపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు, దివంగత సీఎం ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆదివారమైనా సరే విద్యార్థులు హాజరు కావాల్సిన పరిస్థితి. ఎక్కడైనా సీఎం పర్యటన ఉన్నా, మంత్రుల అధికారక కార్యక్రమాలు నిర్వహించినా, విద్యార్థులను పంపించి వారికి ఆహ్వానం పలికిస్తున్నారు. అంతేకాక రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టడం, ముందు వరసల్లో కూర్చోబెట్టడం వంటి చర్యలకు విద్యాశాఖ వర్గాలు పాల్పడుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సీఎం రాక ఆలస్యమైతే చాలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఈ వ్యవహారంపై తొలుత న్యాయవాది సూర్యప్రకాశం స్పందించారు.
మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి కృపాకరణ్ ఇప్పిటికే ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈనేపథ్యంలో మార్పు ‘ఇండియా’ నినాదంతో ఆవిర్భవించి ఓ సంస్థకు చెందిన ప్రతినిధి నారాయణన్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, నేతల పనితీరు, ఎంజీఆర్ జయంతి వేడుకల్లో ఆదివారం, ఇతర సెలవు దినాల్లో సైతం విద్యార్థుల్ని తరలించటాన్ని ఆధారాలతో సహా వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తులు వైద్యనాథన్, ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో బెంచ్ బుధవారం విచారణకు స్వీకరించింది.
వారు పశువులు కాదు:
పిటిషన్‌లోని వివరాలు.. ఆధారాలను పరిశీలించిన బెంచ్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ తీవ్రంగానే స్పందించింది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థుల్ని, పశువులుగా భావిస్తారా..? అని మండి పడ్డారు. ప్రభుత్వ వేడుకలకు విద్యార్థులను తరలించే సంస్కృతి ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ న్యాయవాది రాజగోపాలన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ప్రభుత్వాన్ని వేనకేసుకు రావాల్సిన ఘనకార్యం ఇక్కడ లేదన్నారు. తమరి వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు స్పందించారు.
విద్యార్థులను ఎలా ఆ కార్యక్రామాలకు పంపుతారని, అనుమతి ఎవరు ఇస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను ప్రభుత్వ వేడుకలకు పంపితే తాము కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులను పంపించేందుకు జారీ చేస్తున్న అనుమతులపై స్టే విధిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతలో అదనపు అడ్వకేట్ జనరల్ మణిశంకర్ హాజరై వాదనల్ని వినిపించే యత్నం చేశారు. స్టేను రద్దు చేయాలని కోరారు. అయితే, ప్రభుత్వం తరపున వాదనల్ని వినే ప్రసక్తేలేదని వచ్చే వారానికి వాయిదా వేశారు.