చెన్నై: నిందితులకు సరైన శిక్షలు అమలు చేయకపోవడమే బాలలపై పెరుగుతున్న అత్యాచారాలకు కారణమని తమిళనాడు హై కోర్టు అభిప్రాయపడింది. బాలలపై నేరాలకు పాల్పడుతున్న వారిని నపుంసకులుగా మార్చడమే దీనికి పరిష్కారంగా భావిస్తున్నట్లు, బాలల అత్యాచారం కేసులో పునపరిశీలనకు నమోదైన పిటీషన్పై విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. సాంప్రదాయంగా వస్తున్నటువంటి చట్టాలలో ఈ రకమైన నేరాలను నిరోధించే తరహాలో చర్యలు లేవని పేర్కొంది.
నేరగాళ్లను నపుంసకులుగా మార్చడమనే చర్య కొంత అనాగరికంగా కన్పిస్తున్నప్పటికీ.. అనాగరికమైన చర్యలకు పాల్పడేవారికి ఇలాంటి శిక్షలు విధించక తప్పదని కోర్టు తెలిపింది. ఇప్పటికే పలు దేశాలలో ఈ తరహా నేరాలలో నిందితులను నపుంసకులుగా మార్చే శిక్షలు ఉన్నాయని, ఇండియాలో కూడా ఈ శిక్షను అమలు చేయాలని న్యాయమూర్తి జస్టీస్ ఎన్ కిరుబకరన్ తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బాలలపై అత్యాచారాల కేసుల్లో ఉరిశిక్ష లేదా నపుంసకులుగా మార్చే శిక్షలు విధించేలా న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. గత వారం ఢిల్లీలో చిన్నారులపై దారణ సామూహిక అత్యాచారం ఘటన.. తీసుకోవసిన తక్షణ చర్యలను సూచిస్తుందని కోర్టు తెలిపింది.
బాలలపై అత్యాచారాలకు పాల్పడిన వారకి పోలండ్, రష్యా, ఎస్తోనియాతో పాటు అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు నపుంసకులుగా మార్చే శిక్షను అమలు చేస్తుండగా, ఆసియాలో తొలిసారిగా దక్షిణ కొరియా ఈ తరహా శిక్షను అమలు చేస్తుంది. దేశంలో ఉన్నటువంటి కొందరు ఉదారవాదులు ఈ తరహా శిక్షలను వ్యతిరేకిస్తుండడాన్ని కోర్టు తప్పు పట్టింది. వారికి బాలలు ఎదుర్కునే సంఘర్షణలు తెలియని వారిగా కోర్టు అభిప్రాయపడింది.