సాక్షి, హైదరాబాద్ : ‘తండ్రి వయసున్న ఓ గురువు ఆన్‌లైన్ క్లాసుల అనంతరం నగరంలోని తొమ్మిదో తరగతి విద్యార్థినికి ఓయ్ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ మెసేజ్‌లు పెట్టాడు. ఫొటోలు పంపాలంటూ వేధించాడు. తల్లిదండ్రులకు విషయం తెలిసి నిలదీసే సరికి కాళ్లబేరానికి దిగాడు’.
‘తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లడం చూసిన ఓ కామాంధుడు చాక్లెట్ల ఆశచూపి ఇంట్లోకి వచ్చాడు. ఆ తరువాత అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు’.
విపత్తువేళ చిన్నారులపై కామాంధులు కన్నేస్తున్నారు. ఇటీవల దమ్మాయిగూడ ఘటనలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడే ఇందుకు నిదర్శనం. బాధితుల్లో అధిక శాతం 15 ఏళ్లలోపు వారు కావడం ఆందోళన గురిచేస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు బయటికి వెళ్లిన వారిపై అధికంగా లైంగికదాడులు జరిగాయి. కానీ, లాక్‌డౌన్ అనంతరం ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ముప్పు తప్పడం లేదు. కీచకులు బాలికలతోపాటు బాలురనూ వదలడం లేదు.
ఏదో ఆశచూపి, మభ్యపెట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రుల పిల్లలకు ‘సైబర్’ముప్పు పెరిగింది. వాస్తవానికి లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య తగ్గినా.. వరుసగా ఘటనలు వెలుగు చూస్తుండటం మాత్రం ఆగడంలేదు. దీంతో ఈ విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లలో చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన (ప్రీవెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్–పోక్సో) కేసుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఇలాంటి కేసుల్లో ఒకప్పుడు 4.8 శాతం మాత్రమే ఉన్న కన్విక్షన్ రేటు.. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల 29.8 శాతానికి చేరుకుంది.
ఇంట్లో ఉన్నా వదలడం లేదు..
కరోనా తొలిదశ లాక్‌డౌన్‌కు ముందు పిల్లలు ఎప్పటిలా స్కూలుకు వెళ్లేవారు. చుట్టూ ఉన్న పిల్లలతో ఆడుతూపాడుతూ చదువుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంటి వద్ద ఉన్న పిల్లలకు సైతం రక్షణ లేకుండాపోతోంది. ఆరుబయట ఆడుతున్నా.. ఇంట్లో ఉన్నా కామాంధులు వదలడం లేదు. ఇటీవల దమ్మాయిగూడలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మాయమాటలతో ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు మృగంలా ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. నిత్యం మద్యంమత్తులో తూగే ఆ కీచకుడు చిన్నారిపై అఘాయిత్యం అనంతరం మరో చిన్నారిని ఎత్తుకెళ్లే యత్నంలో పోలీసులకు చిక్కడం గమనార్హం.
తెలిసినవారే నిందితులు..
ఇలాంటి ఘటనల్లో.. ఎక్కువ శాతం నిందితులు తెలిసినవారే కావడం గమనించాల్సిన విషయం. బాధిత చిన్నారులంతా 10 నుంచి 15 ఏళ్లలోపు వాళ్లే. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు అయితే అలాంటి చిన్నారులకు ఈ ముప్పు మరింత పొంచి ఉంది. వాస్తవానికి గతేడాది, ఈ ఏడాది చిన్నారులపై లైంగిక కేసులు కాస్త తగ్గినప్పటికీ.. తరచుగా నమోదవుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులు ఇంటి పట్టున ఉంటున్నా.. లైంగికదాడులు ఆగకపోవడం వారికి పెరిగిన ముప్పును చెప్పకనే చెబుతోంది. గత ఐదేళ్లలో నమోదైన ప్రీవెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కేసులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో రోజుకు ఒకటి చొప్పున లైంగికదాడులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘాతుకాలకు బలవుతు న్న వారిలో బాలురు కూడా ఉండటం గమనార్హం.
సైబర్ అంబాసిడర్లుగా తయారు చేస్తున్నాం
లాక్‌డౌన్ అనంతరం పెరుగుతున్న సైబర్ నేరాలలో పిల్లలు చిక్కుకోవడంపై ముందే అప్రమత్తమయ్యాం. అందుకే, 15 ఏళ్లలోపు చిన్నారులకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవగాహన పెంచేందుకు సైబర్ కాంగ్రెస్ ద్వారా సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సైబర్ ఎక్స్‌పర్ట్స్‌తో 1,650 జిల్లా పరిషత్ స్కూల్స్‌లో ప్రతీ స్కూలులో ఇద్దరు విద్యార్థుల చొప్పున 10 నెలల సుదీర్ఘ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ తయారైన సైబర్ అంబాసిడర్లు తమ తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారినీ సైబర్ నేరాలు, వేధింపులపై చైతన్యపరుస్తారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న బాటలో ముందుకు సాగుతున్నాం.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం లాక్‌డౌన్ కాలంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు కాస్త తగ్గాయి. అయితే, తరచుగా వెలుగుచూస్తుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బాలికలపై జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రావడం లేదు. చాలామంది తల్లిదండ్రులు వేధింపులను పరువు సమస్యగా చూసి ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో విద్యార్ధినీ, విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. టీనేజీ వయసు కావడంతో సైబర్ నేరాలకు సులువుగా బాధితులుగా మారే ప్రమాదముంది. పిల్లలు సోషల్ మీడియా ఖాతాలకు పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలి. ఆన్‌లైన్ నేరాలు, వేధింపుల వల్ల కలిగే నష్టాలను పిల్లలకు వివరించాలి. అదే సమయంలో పదేళ్లలోపు చిన్నారుల యోగక్షేమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరు వేధించినా ఫిర్యాదు చేసేందుకు వెనకాడకూడదు. అలా వదిలేస్తే.. నిందితులు మరో చిన్నారిపై అదే అఘాయిత్యానికి పాల్పడతాడన్న విషయం మరువకూడదు.
– డాక్టర్ మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ
ప్రతీకేసుపై నిరంతర పర్యవేక్షణ
చిన్నారులపై లైంగికదాడుల కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎక్కడ పోక్సో కేసు నమోదైనా.. వెంటనే ఆ కేసు వివరాలు తెప్పించుకుని, దర్యాప్తును మానిటర్ చేస్తున్నాం. ఈ తరహా నేరాలను 13 రకాలు విభజించి నేరం జరిగిన తీరు, ఆధారంగా దర్యాప్తు అధికారికి తగు సలహాలు సూచనలిస్తున్నాం. శాస్త్రీయ ఆధారాల సేకరణ, సీజ్ చేసిన వస్తువుల వివరాలు పరిశీలిస్తున్నాం. పంచనామా దగ్గర నుంచి ఛార్జిషీటు దాఖలు, కోర్టులో జడ్జి ఎదుట బాధితులు వాంగ్మూలం ఇచ్చే దాకా ప్రత్యేక మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తూనే ఉన్నాం.
– బి.సుమతి, డీఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్
Comments
Please login to add a commentAdd a comment